భారత ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్వహించిన “ఆపరేషన్ సింధూర్” నేపథ్యంలో, ఢిల్లీలోని విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కీలక మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఇండియన్ ఆర్మీకి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి పాల్గొని వివరాలు వెల్లడించారు.
కల్నల్ సోఫియా ఖురేషి వెల్లడించిన వివరాల ప్రకారం – పాకిస్థాన్ పశ్చిమ సరిహద్దులో ఆర్మీ బేస్‌లను లక్ష్యంగా చేసుకుని 36 ప్రదేశాల్లో దాడులకు పాల్పడింది. లేహ్ నుంచి సర్క్రీక్ వరకు పాక్ డ్రోన్‌లను ప్రయోగించగా, భారత సైన్యం కైనటిక్, నాన్ కైనటిక్ సాధనాలతో వాటిని సమర్థంగా తిప్పికొట్టింది. బఠిండా సైనిక స్థావరంపై జరిగిన దాడిని కూడా భారత బలగాలు అడ్డుకున్నాయి.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – “దాదాపు 300 నుంచి 400 పాక్ డ్రోన్‌లు వివిధ ప్రాంతాల్లో చొరబడేందుకు యత్నించాయి. వీటిలో చాలా డ్రోన్‌లు టర్కీకి చెందిన అసిస్‌గార్డ్ సోంగర్ మోడల్‌గా గుర్తించబడ్డాయి. డ్రోన్ శిథిలాలపై ఫోరెన్సిక్ దర్యాప్తు కొనసాగుతోంది” అని తెలిపారు.
ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ – “పాక్ తమ దాడుల్లో పౌర విమానాలను కవచంగా ఉపయోగించేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం కరాచీ-లాహోర్ మధ్య పౌర విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి. భారత వైమానిక దళం ఎంతో సంయమనం పాటిస్తోంది. పాక్ ఎయిర్ స్పేస్ మూసివేసిందని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం” అని స్పష్టం చేశారు.
ఇక విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి మాట్లాడుతూ – “గత రాత్రి పాక్ రెచ్చగొట్టే విధంగా చర్యలకు పాల్పడింది. కొన్ని భారత నగరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినా, భారత బలగాలు దాన్ని సమర్థంగా ఎదుర్కొన్నాయి. ఈ దాడుల్లో పాక్‌కే ఎక్కువ నష్టం వాటిల్లింది” అని తెలిపారు.
భారత ప్రభుత్వం ఈ పరిణామాలపై అత్యంత అప్రమత్తంగా ఉండి, దేశ భద్రతకు కట్టుబడి చర్యలు తీసుకుంటోంది.
Read More : భారత ప్రభుత్వం టెరిటోరియల్ ఆర్మీకి అధికారం

One thought on “ఆపరేషన్ సింధూర్‌పై కేంద్రం కీలక అప్డేట్”
Comments are closed.