కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన పూర్తి సమాచారం అమెరికా ఇంటెలిజెన్స్ దగ్గర ఉందని ఆయన తెలిపారు. ఈ దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వారి వెనుక ఎవరు ఉన్నారన్న అంశాలన్నీ అమెరికా ఇంటెలిజెన్స్ నివేదికల్లో స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో పాల్ మాట్లాడుతూ, “వాషింగ్టన్ పోస్ట్‌కి చెందిన ఓ జర్నలిస్టు టర్కీలోని సౌదీ ఎంబసీలో హత్యకు గురయ్యాడు. అందరూ ఆ దుర్ఘటనను ఖండించారు. కానీ ట్రంప్ మాత్రం సౌదీ అరేబియాను మిలియన్ల డాలర్ల డీల్‌తో రక్షించారని” ఆరోపించారు. రాజకీయాల్లో డబ్బుతో చట్టాలను కూడా కొనేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కూడా స్పందించిన పాల్, “ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమించిన 20 శాతం భూభాగాన్ని రష్యాకే అప్పగించాలి అనే ట్రంప్ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నాను,” అన్నారు. “అలాగే అయితే చైనా ఆక్రమించిన భారత భూభాగాన్ని చైనాకే అప్పగించాలా? హాంకాంగ్, పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్ వంటి దేశాలను కూడా చైనాకు అప్పగించాలా?” అంటూ మండిపడ్డారు.

ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Read More : భారత్ నిర్ణయం – పాక్ కు మరో గట్టి షాక్