మానవతా దృక్పథంతో విశాఖలో ఉండేందుకు అనుమతి..

పహల్గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో నివసిస్తున్న పాకిస్థానీ పౌరులకు భారత ప్రభుత్వం ఇచ్చిన దేశ విడిచిపోవాలన్న గడువు ముగిసిన వేళ… విశాఖపట్నంలో నివసిస్తున్న ఒక పాకిస్థానీ కుటుంబానికి తాత్కాలికంగా ఊరట లభించింది. మానవతా కారణాల దృష్ట్యా, ఆ కుటుంబం మరికొంతకాలం నగరంలోనే ఉండేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు.

ఏమైంది?
కేంద్రం జారీ చేసిన ఆదేశాల ప్రకారం, పాకిస్థానీ పౌరులు ఏప్రిల్ 29వ తేదీకి ముందే భారత్‌ను విడిచిపెట్టాలి. ఈ నేపథ్యంలో, విశాఖలో నివసిస్తున్న ఓ కుటుంబం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీను కలిసి తమ కుమారుడు తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. చికిత్స పూర్తవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో, నగరాన్ని తక్షణం విడిచిపోవడం సాధ్యపడడం లేదని వారు విజ్ఞప్తి చేశారు.

ఈ కుటుంబంలో భర్త, పెద్ద కుమారుడు పాకిస్థాన్ పౌరులు కాగా… భార్య, చిన్న కుమారుడు భారత పౌరులు. దీర్ఘకాలిక వీసా కోసం వారు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారని, కానీ అది ఇంకా పెండింగ్‌లో ఉందని తెలిపారు.

అధికారుల స్పందన
పరిస్థితిని అర్థం చేసుకున్న కమిషనర్ బాగ్చీ, వెంటనే ఈ విషయాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులకు తెలిపారు. అనంతరం ఏపీ ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) అధికారులతో సంప్రదించి, ఆ కుటుంబానికి తాత్కాలిక అనుమతిని పొందింది.

సీపీ ప్రకటన:
ఈ విషయమై నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, “మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి తాత్కాలికంగా విశాఖలోనే ఉండేందుకు అనుమతి లభించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వారు నగరంలోనే ఉండవచ్చు,” అని వెల్లడించారు.

Read More : జర్మనీలో క్యాన్సర్‌తో మృతి చెందిన రెహానా బేగం: గిద్దలూరు గ్రామంలో విషాదం

One thought on “మానవతా దృక్పథంతో విశాఖలో ఉండేందుకు అనుమతి..

Comments are closed.