సింహాచలం చందనోత్సవంలో చోటుచేసుకున్న గోడ కూలిన విషాద ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్రంగా స్పందించారు. భక్తుల ప్రాణాలు కోల్పోయిన ఈ దుర్ఘటనను గంభీరంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పాల్ అన్నారు.
“ప్రజల నుంచి దేవాలయాల పేరుతో టిక్కెట్ల రూపంలో లక్షల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆ డబ్బులో కొంత అయినా దేవాలయాల మరమ్మతులకు ఖర్చు చేయలేరా?” అని పాల్ ప్రశ్నించారు. ఇది అధికారుల నిర్లక్ష్యం మరియు ఆస్తుల సరైన నిర్వహణ లేకపోవడానికి నిదర్శనమని ఆయన ఆగ్రహంగా వ్యాఖ్యానించారు.
ఇప్పుడు వేసవికాలంలోనే గోడలు ఇలా కూలిపోతే, రానున్న వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టమని పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలనలో సరైన పర్యవేక్షణ లేకపోవడమే ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతోందని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలోని అన్ని దేవాలయాల భద్రతా చర్యలపై సమగ్ర సమీక్ష జరిపి, భవనాల నిర్మాణ నాణ్యతను పరిశీలించాలని పాల్ డిమాండ్ చేశారు. భక్తుల ప్రాణాలకు విలువ లేదన్న దృక్పథం ఇక మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు.
ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకూడదని ఆయన సూచించారు.
Read More : మానవతా దృక్పథంతో విశాఖలో ఉండేందుకు అనుమతి..
