జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులను లక్ష్యంగా జరిగిన కిరాతక ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భద్రతా చర్యలను మరింత కఠినంగా ముమ్మరం చేసింది.
ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీలో అత్యున్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కీలక భేటీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నౌకాదళ అధిపతి దినేష్ త్రిపాఠి, వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ హాజరై భద్రతాపరమైన వివిధ అంశాలపై చర్చించారు.
ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్లో తాజా భద్రతా పరిస్థితులు, ఉగ్రవాదుల కదలికలు, వాటిని అణచివేయడానికి చేపట్టాల్సిన తక్షణ చర్యలపై సమగ్రంగా చర్చ జరిగింది. ముఖ్యంగా పహల్గామ్ పరిసరాల్లో ఏర్పడిన భద్రతా ముప్పును త్రివిధ దళాధిపతులు రక్షణ మంత్రికి వివరించారు. ఈ అంశాన్ని త్వరలో జరగనున్న కేబినెట్ భద్రతా కమిటీ భేటీలో కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇక ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. దాడి జరిగిన ప్రదేశానికి సమీపంగా అదనపు బలగాలను తరలించి ‘సెర్చ్ అండ్ డెస్ట్రాయ్’ ఆపరేషన్లను ప్రారంభించాయి. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రాంతీయ భద్రతా దళాలను పూర్తిగా అప్రమత్తం చేశారు.
ఈ క్రమంలో, దాడిలో పాల్గొన్న ముగ్గురు అనుమానితుల స్కెచ్‌లు భద్రతా సంస్థలు విడుదల చేశాయి. వీరిని ఆసిఫ్ ఫౌజీ (కోడ్ నేమ్: మూసా), సులేమాన్ షా (యూనస్), అబూ తల్హా (ఆసిఫ్)గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గతంలో పూంచ్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో కూడా వీరి పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. వీరి కోసం కాశ్మీర్ లోయ అంతటా భారీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Read More : అమిత్ షా : ఉగ్రవాద దాడిని పరిశీలించారు

2 thoughts on “కేంద్రం అత్యంత గంభీరంగా స్పందించింది”
Comments are closed.