ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రులతో కీలక భేటీలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పర్యటనకు సిద్ధమయ్యారు. రేపు (మంగళవారం) ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు, ఈరోజు (సోమవారం) అర్థరాత్రి 12 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు.

విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసమైన వన్ జన్ పథ్‌కు వెళ్లి బస చేయనున్నారు. మంగళవారం ఉదయం నుంచి కేంద్ర మంత్రులతో సమావేశాలు ప్రారంభించనున్న చంద్రబాబు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు.

ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, నిధుల విషయాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు జలవనరుల శాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రితో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీల్లో రాష్ట్రానికి అవసరమైన సహాయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read More : వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో నిరాశ — విచారణ వారం వాయిదా!