ఏపీ మద్యం స్కాం’ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ వేగవంతం చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం, ధరలు, బ్రాండ్ల ఎంపిక, సరఫరాదారులతో సంబంధాలు వంటి అంశాలపై సిట్ దర్యాప్తు చేస్తున్నది.
ఈ క్రమంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. శనివారం ఉదయం సిట్ కార్యాలయానికి చేరుకున్న మిథున్ రెడ్డిని ఎనిమిది గంటలపాటు ప్రశ్నించారు. ఈ విచారణలో మద్యం కుంభకోణంలో కీలకమైన అంశాలపై, ముఖ్యంగా కొన్ని డిస్టిలరీలతో అనుకూలంగా వ్యవహరించినందుకు సంబంధించి ఆయనను ప్రశ్నించారు.
ప్రధానంగా రాజ్ కసిరెడ్డికి చెందిన ఆదాన్ డిస్టిలరీ, డికార్ట్ నుండి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ చేసిన కొనుగోళ్లు, కాసిరెడ్డితో మరియు ఆయన అనుచరులతో ఉన్న ఆర్థిక సంబంధాలపై కూడా మిథున్ రెడ్డిని ప్రశ్నించారు.
విచారణ అనంతరం మిథున్ రెడ్డి నుంచి స్టేట్‌మెంట్ తీసుకుని, ఆయన సంతకాన్ని తీసుకున్నట్టు సమాచారం. కోర్టు ఆదేశాల ప్రకారం మిథున్ రెడ్డిని న్యాయవాది సమక్షంలో విచారించారు.
