ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం

వైసీపీ అధినేత జగన్‌ సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఈ ఘటనపై తన ఆవేదనను వెల్లడించిన ఆమె, భారతి రెడ్డిపై సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరమైనవిగా పేర్కొన్నారు.

“ఇలాంటి నీచపు వ్యాఖ్యలు తీవ్రవాద చర్యలతో సమానం. వీరిని నడిరోడ్డుపై ఉరివేసినా ఏ తప్పూ లేదు,” అంటూ షర్మిల తీవ్రంగా స్పందించారు. ఇలాంటి దురుసు వ్యాఖ్యలపై ప్రోత్సాహం ఇచ్చే యూట్యూబ్ చానల్స్‌పైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

కూటమి ప్రభుత్వాన్ని ఒక మహిళగా విజ్ఞప్తి చేస్తున్నానని షర్మిల పేర్కొంటూ, ఇలాంటి మకిలి చేష్టలను సమాజం సహించదని స్పష్టం చేశారు. ఎవరైనా అయినా శిక్షపడాలని, వ్యక్తిత్వ హననానికి పాల్పడే వ్యవస్థను అంతం చేయాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

“ఈ విష సంస్కృతికి వేదిక వేసిన వారు వైసీపీ, టీడీపీలు. ఈ రెండు పార్టీలే సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యల పునాది వేశారు. ఆధికారం దుర్వినియోగంతో వ్యవస్థను భ్రష్టుపట్టించిన వారే ఇప్పుడు ఈ పరిస్థితులకు కారణం” అని షర్మిల మండిపడ్డారు.

అంతేకాకుండా, రాజకీయ కక్షల పేరుతో కుటుంబాలపై దాడి చేసి, చిన్నపిల్లల వరకూ ఈ విష ప్రచారంలోకి లాగారని పేర్కొన్నారు. ఈ విష సంస్కృతిని ఎదిరించేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసివచ్చి పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.

Read More : ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు రేపే విడుదల