పరువు నష్టం కేసు: హేమ నోటీసులతో టాలీవుడ్‌లో కలకలం

Hema legal notice Karate Kalyani Tamanna

గత కొన్ని రోజులుగా మీడియా స్పాట్‌లైట్‌కు దూరంగా ఉన్న టాలీవుడ్ సీనియర్ నటి హేమ మళ్లీ వార్తల్లోకెక్కింది. ఇటీవల “సినిమాలకు గుడ్‌బై” అంటూ చేసిన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ అయిన ఆమె, తాజాగా కరాటే కల్యాణి, బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రిలతో పాటు పలు యూట్యూబ్ ఛానెల్స్‌కు లీగల్ నోటీసులు జారీ చేసింది. తన పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించిన హేమ, ఈ చర్య ద్వారా న్యాయపరంగా తన న్యాయం సాధించాలనుకుంటున్నట్టు వెల్లడించారు.

“కొన్ని రోజుల క్రితం ఓ సమస్యలో ఇరుక్కున్నపుడు, వారు నాపై బురద చల్లే ప్రయత్నం చేశారు. నాపై అసత్య ప్రచారాలు చేయడమే కాక, మా వ్యక్తిగత జీవితాలను కూడా నిశితంగా విమర్శించారు,” అని హేమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మాటల ప్రకారం, ఇవన్నీ నిరూపించడానికి అవసరమైన వీడియోలు, క్లిప్పింగ్స్ ఇప్పటికీ నెట్‌లో అందుబాటులో ఉన్నాయంటూ వివరించారు. “ఈసారి మాటల్లో కాకుండా న్యాయస్థానం ద్వారా నా పరువు నిలబెట్టుకుంటాను” అంటూ గట్టిగా చెప్పారు.

గతేడాది బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ కేసులో హేమ అరెస్ట్ కావడం, రిమాండ్‌కు తరలింపు, తర్వాత బెయిల్‌పై విడుదల – ఇవన్నీ అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయ్యాయి. అయితే హేమ అప్పట్లోనే తనపై ఉన్న ఆరోపణలను ఖండించారు. డ్రగ్స్ తీసుకోలేదని, తన రక్త పరీక్షల్లో నెగటివ్ ఫలితాలొచ్చాయని ఆమె వెల్లడించారు. ఇప్పుడు ఆ వ్యవహారాన్నే ఆధారంగా చేసుకుని కొంతమంది ప్రముఖులు, మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇంకా కొంతమంది పేర్లు, చిరునామాలు తెలియకపోవడంతో మిగతా వారికి కూడా త్వరలో నోటీసులు పంపే అవకాశం ఉందని హేమ తెలిపారు.

Read More

One thought on “పరువు నష్టం కేసు: హేమ నోటీసులతో టాలీవుడ్‌లో కలకలం

Comments are closed.