72వ అంతర్జాతీయ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ వేదికగా జరుగనుండటంతో రాష్ట్రంలో పర్యాటక రంగానికి మరింత ఊపు దక్కనుంది. మే 7వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో సుమారు 140 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొననున్నారు.
ఈ నేపథ్యంలో బేగంపేట్ టూరిజం ప్లాజాలో ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు, టీజీటీడీసీ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లీ, 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, మిస్ వరల్డ్ పోటీల ద్వారా తెలంగాణ పర్యాటక రంగానికి భారీగా లాభాలు చేకూరుతాయని అన్నారు. ఈ పోటీల వల్ల ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు అవకాశం లభిస్తుందని చెప్పారు. రూ.54 కోట్ల పెట్టుబడిలో సగం నిధులు ప్రభుత్వం కేటాయించగా, మిగతా సగం నిధులు ప్రమోటర్ల నుంచి సేకరించనట్లు వెల్లడించారు.
తెలంగాణలోని సాంస్కృతిక సంపదను ప్రపంచానికి తెలియజేయడమే కాకుండా, ఈ పోటీల వల్ల ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులు, ఆదాయ వృద్ధి జరుగుతుందని మంత్రి తెలిపారు. మిస్ వరల్డ్ పోటీలు మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తాయని, ఈ పోటీలు పట్ల రాజకీయ కోణంలో విమర్శలు చేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.
భారతదేశానికి ప్రాధాన్యత:
ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, కళలు ఎంతో గొప్పవని తెలిపారు. “నమస్తే ఇండియా” అంటూ అందరికీ అభివాదం చేసిన క్రిస్టినా, భారతదేశం తనకు ఎంతో ప్రియమైన దేశమని చెప్పారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సందర్శన తనకు ప్రత్యేక అనుభూతిని అందించిందని వెల్లడించారు.
తెలంగాణ సంపదపై స్పెషల్ ఫోకస్:
తెలంగాణ పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతానికి 2500 ఏళ్ల చరిత్ర ఉందని, రామప్ప, వేయి స్థంభాల ఆలయం, చార్మినార్, గోల్కొండ కోట వంటి కట్టడాలు రాష్ట్ర కీర్తిని ప్రపంచానికి చాటుతాయని తెలిపారు. తెలంగాణలో మెడికల్ టూరిజానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, ఈ పోటీల ద్వారా రాష్ట్ర ఆదాయ వృద్ధికి తోడ్పడుతుందని వెల్లడించారు.

One thought on “తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటనున్న మిస్ వరల్డ్ పోటీలు”
Comments are closed.