దొంగ బాబా అరెస్టు – మహిళలకు మత్తుమందు ఇచ్చి అరాచకాలకు పాల్పడిన ఘటన

donga baba

మెదక్ జిల్లాలో మాయలతో మభ్యపెట్టి మహిళలను మోసం చేసిన ఓ దొంగ బాబాను పోలీసులు అరెస్టు చేశారు. మహిళలకు మత్తుమందు ఇచ్చి వారిపై లైంగిక దాడులకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టిస్తోంది.

మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన బొమ్మెల బాపుస్వామి అనే వ్యక్తి తనను స్వామీజీగా చెప్పుకొని, మాయలు, మంత్రాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్నాడు. పూజలు నిర్వహించి సమస్యలు తొలగిస్తానని చెప్పి, మహిళలను తన వలలోకి లాగేవాడు. ఆ తర్వాత వారిని ఒంటరిగా పిలిచి మత్తు పదార్థాలు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడేవాడు.

ఈ క్రమంలో బాధితులను బ్లాక్ మెయిల్ చేసేందుకు వారి వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు గుప్పెట్లో పెట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ వీడియోల ద్వారా బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు వెల్లడించారు.

బాధిత మహిళల ఫిర్యాదు మేరకు మెదక్ పోలీసులు బాపుస్వామిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి తాయత్తులు, మత్తుమందు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఫోన్లలో మహిళలతో ఉన్న వీడియోలు, ఫొటోలు లభ్యమయ్యాయని ఎస్పీ వెల్లడించారు.

ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రజలకు సూచిస్తూ, అనుమానాస్పదంగా తిరుగుతున్న దొంగ బాబాలపై అప్రమత్తంగా ఉండాలని, మంత్రాలు, మాయలతో మోసపోవద్దని సూచించారు. సమస్యలు తీర్చుకోవాలనుకుంటే కుటుంబసభ్యులు, స్నేహితులతో చర్చించి సరికొత్త మార్గాలు అన్వేషించాలని ప్రజలకు సూచించారు.

Read More

One thought on “దొంగ బాబా అరెస్టు – మహిళలకు మత్తుమందు ఇచ్చి అరాచకాలకు పాల్పడిన ఘటన

Comments are closed.