లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం

Mallu Bhatti

లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో శాస్త్రీయ విధానాన్ని పాటించాలని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించాలని పలు రాజకీయ పక్షాల నేతలు సూచించారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ విషయం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి నేతృత్వం వహించారు.

తెలంగాణకు నష్టం ఉంటుందన్న ఆందోళన
పునర్విభజన ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సంఖ్య పెరగడం వల్ల దక్షిణాది ప్రాంతం రాజకీయంగా దెబ్బతింటుందనే అభిప్రాయాన్ని నేతలు తెలిపారు. దీనిపై శాస్త్రీయంగా ముందుకెళ్లేలా కేంద్రాన్ని ఒప్పించే కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

తీర్మానం చేయాలని డిమాండ్
ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ… జనాభా ప్రాతిపదికన పునర్విభజనను వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపాలని కోరారు. కాంగ్రెస్ నేత జానారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం పునరాలోచించకపోతే ఇది ప్రమాదకర పరిస్థితులకు దారితీయొచ్చని హెచ్చరించారు.

కేంద్రాన్ని ఒప్పించేందుకు కృషి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, సీపీఐ శాసనసభా పక్ష నేత కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లోనూ అదే తరహాలో పెంచాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, పల్లా వెంకట్రెడ్డితోపాటు పలు పార్టీల నేతలు హాజరయ్యారు.

Read More