ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. చిన్న స్థాయి ఎన్నికలైనా, పెద్ద స్థాయి ఎన్నికలైనా.. అధికార, విపక్ష పార్టీలు తగ్గేదేలేదంటూ వ్యూహాత్మకంగా క్యాంప్ రాజకీయాలకు తెరతీశాయి. ఈ నేపథ్యంలో కడప సహా పలు జిల్లాల్లో నేడు జరగనున్న లోకల్ బాడీ ఉప ఎన్నికలు (Local Body By-elections) భారీ రాజకీయ వేడిని సృష్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 9 చోట్ల ఉపఎన్నికలు జరుగుతుండగా, కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక ప్రధానంగా నిలిచింది.
కడప జడ్పీ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ
కడప జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. టీడీపీ నేతలు ఈ ఎన్నికను నిలిపివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించినా, న్యాయస్థానంStay ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో నేడు ఎన్నిక యథావిధిగా జరుగనుంది. వైసీపీ విజయం తథ్యమే అయినా, తమ సభ్యులను ఇతర పార్టీలు ఆకర్షించకుండా ముందు జాగ్రత్త చర్యగా క్యాంప్ రాజకీయాలకు వైసీపీ తెరతీసింది. నిన్న రాత్రి క్యాంప్ నుంచి కడపకు చేరుకున్న వైసీపీ జెడ్పీటీసీలు నేడు నేరుగా జెడ్పీ కార్యాలయానికి వెళ్తారని సమాచారం.
రామగిరి ఎంపీపీ ఎన్నికలో ఉద్రిక్తత
శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో ఉపఎన్నికలు హాట్‌టాపిక్‌గా మారాయి. వైసీపీ ఆధిక్యంలో ఉన్న ఈ మండలంలో, మునుపటి ఎంపీపీ మీనిగ నాగమ్మ మరణించడంతో ఎన్నిక జరుగుతోంది. అయితే కొందరు వైసీపీ సభ్యులు టీడీపీతో టచ్‌లోకి వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీల కార్యకర్తలు రాడ్లు, కర్రలతో ఒకరిపై మరొకరు దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ, వైసీపీ నేతల వాహనాల్లో మారణాయుధాలు పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది.
అచ్చంపేట ఎంపీపీ ఎన్నికలో ఉత్కంఠ
పల్నాడు జిల్లా అచ్చంపేటలో ఎంపీపీ రజినిబాయ్ రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 17 మంది ఎంపీటీసీలలో ఒకరు మృతి చెందగా, మిగిలిన 16 మందిలో 9 మంది అదృశ్యమయ్యారు. దీంతో టీడీపీ తమ నేతలను కిడ్నాప్ చేసిందంటూ వైసీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. టీడీపీ భూక్యా స్వర్ణమ్మను ఎంపీపీగా చేయాలని ప్రయత్నిస్తుండగా, వైసీపీ దీనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఇక్కడి ఎన్నిక తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
కాకినాడ రూరల్‌లో క్యాంప్ రాజకీయాలు
కాకినాడ రూరల్ ఎంపీపీ ఎన్నికలో జనసేన కీలక పాత్ర పోషిస్తోంది. వైసీపీకి చెందిన 7 మంది ఎంపీటీసీలు ఇటీవల జనసేనలో చేరిపోవడంతో పరిషత్‌లో బలం మారింది. దీంతో జనసేన క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది. పార్టీకి మద్దతిస్తున్న ఎంపీటీసీలను లంబసింగి క్యాంప్‌కు తరలించి, నేడు నేరుగా మండల పరిషత్ కార్యాలయానికి తీసుకురావాలని జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ వ్యూహాన్ని రచించారు.
గోపవరం ఉపసర్పంచ్ ఎన్నిక ఆసక్తికరం
కడప జిల్లా గోపవరం పంచాయతీలో ఉపసర్పంచ్ ఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది. మొత్తం 20 వార్డుల్లో వైసీపీకి 14, టీడీపీకి 6 మంది సభ్యులు ఉన్నారు. ఎన్నిక సమయంలో టీడీపీ తమ సభ్యులను ప్రలోభాలకు గురిచేస్తోందని ఆరోపిస్తూ, వైసీపీ తమ 14 మంది వార్డు మెంబర్లను క్యాంప్‌కు తరలించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత.. 144 సెక్షన్ అమలు
ఉపఎన్నికల వేళ ఉమ్మడి అనంతపురం జిల్లా సహా పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అధికార పార్టీ ఆకర్షణ మంత్రంతో ప్రతిపక్ష సభ్యులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు రాకుండా పోలీసులు 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు.
