తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలను ఐక్యంగా ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి మద్దతుగా కలిసి రావాలని కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను కలిసి ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
అంతేకాకుండా, మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కూడా తమతో కలిసి రావాలని ఆయన కోరారు. వివాదాలకు తావు లేకుండా బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకొచ్చినట్లు తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు మంగళవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని నిర్ణయించామని తెలిపారు. రాజకీయంగానూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
బీసీ రిజర్వేషన్ల కోసం 1979లోనే మండల్ కమిషన్ ఏర్పాటైన విషయాన్ని గుర్తుచేశారు. మండల్ కమిషన్‌తోనే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత లభించిందని సీఎం వివరించారు.
కులగణన, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను ఏడాది కాలంలో పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. తెలంగాణలో 56.36 శాతం బలహీనవర్గాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. బలహీన వర్గాలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో కామారెడ్డి సభలో డిక్లరేషన్ పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
తెలంగాణలో కులగణన చేపట్టిన విషయాన్ని వెల్లడిస్తూ.. గతేడాది ఫిబ్రవరి 4న కేబినెట్‌లో తీర్మానం చేశామని చెప్పారు. తొలి దఫా సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశమిచ్చామన్నారు. 3.55 కోట్ల మందికిపైగా సంపూర్ణ వివరాలు అందించారని, ఈ సర్వేలో 75 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

One thought on “CM Revanth Reddy: బీసీ రిజర్వేషన్ కోసం అన్ని పార్టీలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపు”
Comments are closed.