ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి (AP Capital Amaravati) నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) చేతుల మీదుగా రాజధాని పనుల శంకుస్థాపన చేయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి మూడవ వారంలో ప్రధాని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానిని శంకుస్థాపనకు ఆహ్వానించారని సమాచారం. అయితే వచ్చే నెల మూడవ వారం వరకు ప్రధానిమారు షెడ్యూల్ బిజీగా ఉండటంతో ఆ తరువాతే అధికారికంగా తేదీ ఖరారు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. గతంలోనూ రాజధాని నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
రాజధాని నిర్మాణానికి నిధుల సమీకరణ:
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రపంచ బ్యాంక్ రుణ మంజూరు చేయడంతో రాజధాని నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) టెండర్ల ప్రక్రియను ఖరారు చేసింది. అయితే ప్రధాని పర్యటన ఖరారుకు సంబంధించి అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదని సంబంధిత అధికారులు తెలిపారు.
ఇదే క్రమంలో, ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో దాదాపు రూ.40వేల కోట్ల విలువైన పనులకు ఆమోదం లభించింది. ఈ సమావేశంలో కాంట్రాక్టు ఏజెన్సీలకు అంగీకార పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
నిధుల సమీకరణ వివరాలు:
- వరల్డ్ బ్యాంక్ మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కలిసి దాదాపు రూ.13,400 కోట్ల రుణాన్ని మంజూరు చేశాయి.
- హడ్కో (HUDCO) నుంచి మరో రూ.11,000 కోట్ల రుణం సమీకరణకు అనుమతి లభించింది.
- జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ నుంచి రూ.5,000 కోట్ల రుణాన్ని పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
- కేంద్ర ప్రభుత్వ గ్రాంట్‌గా రూ.1,500 కోట్ల నిధులు రాబోతోన్నాయి.
అందువల్ల మొత్తం రూ.31,000 కోట్ల నిధులు అమరావతి నిర్మాణ పనుల కోసం సిద్ధంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

2 thoughts on “ప్రధానితో శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేయనున్న ఏపీ ప్రభుత్వం”
Comments are closed.