వేంకటపాలెంలో మార్చి 15 శనివారం సాయంత్రం జరగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవం కోసం టీటీడీ (Tirumala Tirupati Devasthanams) విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకను వీక్షించేందుకు సుమారు 27,000 మంది భక్తులు హాజరుకానున్నారు. టీటీడీ ఈవో జె. శ్యామలరావు శుక్రవారం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు.
భక్తుల రవాణా కోసం ప్రత్యేక బస్సులు
వేంకటపాలెంలో నిర్వహించే కళ్యాణోత్సవానికి సీఆర్‌డీఏ పరిధిలోని 24 గ్రామాల ప్రజలు సులువుగా రాకపోకలు సాగించేందుకు టీటీడీ దాదాపు 300 బస్సులను ఏర్పాటు చేసింది. తుళ్లూరు, తాడేపల్లి, తాడికొండ, మంగళగిరి ప్రాంతాల నుంచి భక్తులు కళ్యాణ వేదిక ప్రాంగణానికి చేరుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
అలాగే విజయవాడ నుంచి అమరావతికి బస్సు సౌకర్యం విరివిగా ఉండేలా ఏర్పాటు చేశారు. మందడం నుంచి కళ్యాణ వేదిక వరకు ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు నడిపించనున్నారు.
అలంకరణలు – కళ్యాణోత్సవానికి ప్రత్యేక ఆకర్షణ
శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం, పరిసర ప్రాంతాల్లో పుష్పాలంకరణ వేగంగా జరుగుతోంది. దాదాపు 4 టన్నుల పూలు మరియు 30,000 క్లట్ ఫ్లవర్స్ తో ఆలయాన్ని అందంగా అలంకరించనున్నారు. మామిడి, అరటి, టెంకాయతోరణాలతో కళ్యాణ వేదికను తీర్చిదిద్దారు.
భక్తి సంగీత కార్యక్రమాలు
శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు చెన్నైకి చెందిన ప్రముఖ గాయని శ్రీమతి నిత్యశ్రీ మహదేవన్ గ్రూప్ ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి. అనంతరం 5 గంటల నుంచి 6:15 గంటల వరకు ప్రియా సిస్టర్స్ అన్నమాచార్య సంకీర్తనలను ఆలపించనున్నారు.
ప్రసాదాల పంపిణీ
కళ్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులకు శ్రీవారి లడ్డు, పసుపు, కుంకుమ ప్యాకెట్, పసుపు దారం, కంకణాలు, శ్రీవారి పుస్తక ప్రసాదం, కల్యాణోత్సవ అక్షింతలు కలిపిన ఒక బ్యాగ్ పంపిణీ చేయనున్నారు.
విద్యుత్ అలంకరణ – ప్రత్యేక ఆకర్షణ
వేదిక ప్రాంగణంలో 5 వేల ఫ్లడ్ లైట్లు, 25 జనరేటర్స్, 18 ఎల్ఈడీ స్క్రీన్‌లు, దశావతారాలు, శ్రీవేంకటేశ్వరుడు, శ్రీ పద్మావతి అమ్మవార్ల కటౌట్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. శ్రీనివాస కళ్యాణ వేదిక పరిసరాల్లో 60 తోరణాలు సుదీర్ఘ విద్యుత్ అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
భక్తులు అధిక సంఖ్యలో హాజరుకానుండటంతో టిటిడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో శ్యామలరావు తెలిపారు.

One thought on “శ్రీనివాస కళ్యాణోత్సవం కోసం భారీ ఏర్పాట్లు”
Comments are closed.