కార్మికుల సొమ్ముకే ఎసరుపెట్టిన భారీ కుంభకోణం

scammer

కృష్ణా జిల్లా గుడివాడలో కార్మికుల సొమ్ముతో భారీ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. గుడివాడ మున్సిపల్ ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో దాదాపు రూ.9 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు వెల్లడైంది. సొసైటీ కమిటీ సభ్యులు, బ్యాంక్ అధికారులు కుమ్మక్కై కార్మికుల సొమ్మును గోల్మాల్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ స్కామ్‌లో ఆసక్తికర విషయం ఏంటంటే.. వడ్డాది భాస్కరరావు అనే కార్మికుడు 20 ఏళ్ల క్రితం మరణించినప్పటికీ, అతడి పేరుతో 2022లో రూ.10 లక్షల రుణం తీసుకున్నట్లు బయటపడింది. వైసీపీ నాయకుల అండతో కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షురాలు లక్ష్మీ లక్షలాది రూపాయలు మింగేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ అవకతవకలపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పందించారు. ఈ ఘటనను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సీఐడీ విచారణ కోరతానని ఆయన ప్రకటించారు.

56 మంది కార్మికుల జీతాల్లో కోత

ఈ స్కామ్‌ దాదాపు 56 మంది కార్మికుల వేతనాల్లో కోత రావడంతో వెలుగులోకి వచ్చింది. మొత్తం 93 మంది సభ్యులతో నడిచే ఈ కోఆపరేటివ్ సొసైటీ సభ్యుల పేర్లపై సొసైటీ కమిటీ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ రుణాలు తీసుకుందని వెల్లడైంది. అయితే కార్మికులు ఆ రుణాలను తీసుకోకపోయినా జీతాల్లో కోతలు రావడంతో విషయం బయటపడింది.

గుమస్తా రాజు కీలక ఒప్పుకోవడం

కుంభకోణంపై కార్మిక సంఘాల నాయకులు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము దృష్టికి తీసుకెళ్లారు. గుమస్తా రాజు సొసైటీ అధ్యక్షురాలు లక్ష్మీ రూ.30 లక్షల వరకూ వాడుకున్నట్లు ఒప్పుకున్నాడు. మిగిలిన మొత్తం సొమ్మంతా సొసైటీ అధ్యక్షురాలే వినియోగించిందని గుమస్తా వెల్లడించాడు.

కార్మికుల ఆందోళన

ఈ స్కామ్‌లో తమకు న్యాయం చేయాలని, సొసైటీ అధ్యక్షురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే ఆత్మహత్యలే దిక్కు అంటూ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read More