విజయనగరం: ప్రజాప్రతినిధులుగా ఉన్న నాయకులు తమ నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ క్రమంలో విజయనగరం ఎంపీ కాళిశెట్టి అప్పలనాయుడు తన నియోజకవర్గంలో మూడో సంతానం కలిగిన కుటుంబాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించారు.
ఎంపీ ప్రకటించిన పథకం ప్రకారం, తమ కుటుంబంలో మూడో సంతానం పుట్టిన ప్రతి తల్లికి ఆర్థిక ప్రోత్సాహంగా అందించనున్నట్లు వెల్లడించారు. మూడో సంతానం ఆడపిల్లగా జన్మిస్తే ఆ కుటుంబానికి ₹50,000 విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్ అందించనున్నారు. మూడో సంతానం మగపిల్లగా జన్మిస్తే ఆ కుటుంబానికి పాలిచ్చే ఆవును అందజేయనున్నట్లు తెలిపారు.
ఈ విధానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జీవించే కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే తన లక్ష్యమని ఎంపీ అప్పలనాయుడు స్పష్టం చేశారు. మూడో సంతానం పుట్టిన వెంటనే ఈ సహాయాన్ని అందించేందుకు తగిన చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు.
సామాజిక సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు, ముఖ్యంగా పేద కుటుంబాలకు మద్దతు అందించేందుకు ఈ ప్రణాళిక రూపొందించినట్లు ఎంపీ తెలిపారు. ఈ ప్రోత్సాహకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని, మూడో సంతానానికి ఈ విధంగా ప్రోత్సాహం కల్పించడం ద్వారా కుటుంబ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
