సీఎం రేవంత్ రెడ్డి: అబద్దాల సంఘం అధ్యక్షుడు ఎక్కడ.. అసెంబ్లీలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో జరిగిన రైతు భరోసా చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేపట్టిన రైతుబంధు పథకం అనర్హులకు లబ్ధి కలిగించిందని ఆయన విమర్శించారు. రైతు భరోసా పథకం అమలు ద్వారా రైతుల ఖాతాల్లో సంక్రాంతి అనంతరం డబ్బులు జమ చేయనున్నామని ఆయన వెల్లడించారు.
రైతు భరోసా పథకం విధివిధానాలు త్వరలో ప్రకటిస్తామని, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం మార్గదర్శకాలు విడుదల చేస్తామని సీఎం తెలిపారు. రైతుల అభివృద్ధే తమ లక్ష్యమని, సాగుచేయని భూములకు రైతుబంధు ద్వారా అనవసరంగా రూ. 22,606 కోట్లు ఇచ్చారని విమర్శించారు.
రైతుబంధులో దొంగ పాస్ పుస్తకాలు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో కొందరు దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసి రైతుబంధు సహాయం పొందారని ఆయన ఆరోపించారు. రైతుల పేర్లతో బంధువులకు, అనుచరులకు పథకం లబ్ధి చేకూర్చారని పేర్కొన్నారు.
కేసీఆర్‌పై సెటైర్లు
80 వేల పుస్తకాలు చదివిన వారు రైతు భరోసాపై సలహాలు ఇస్తారని అనుకున్నామన్నారు. “మేము కాదు, రైతులే మా ఆదర్శం” అంటూ కేసీఆర్‌పై సెటైర్లు వేశారు. బీఆర్‌ఎస్ నేతల వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారని, రైతు ఆత్మహత్యలపై అబద్ధాలు చెబుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ కీలక ప్రకటన
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అన్యాయాలు వెలుగులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. న్యాయం చేయడం తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
