ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు: హైకోర్టు మధ్యంతర ఉపశమనం పొడిగింపు

కేటీఆర్ | ఫార్ములా – ఈ కార్ రేసింగ్‌లో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు

హైదరాబాద్: ఫార్ములా – ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరుకావాల్సిందిగా కేటీఆర్‌ను ఆదేశించింది. అలాగే, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌, హెచ్ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్ఎన్‌ రెడ్డిలను కూడా జనవరి 2, 3 తేదీల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈడీ, పీఎంఎల్ఏ కింద విచారణను ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా చేపట్టింది.

ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌ కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌ కేసులో కేటీఆర్‌ను ఈ నెల 31 వరకు అరెస్ట్‌ చేయవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులను పొడిగిస్తూ, ఏసీబీ దాఖలు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. వాదనలను వినకుండానే ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చిచెప్పింది.

ఈ-కార్‌ రేసుపై ఏసీబీ కేసును హైకోర్టులో సవాలు చేసిన కేటీఆర్, ఆ కేసును కొట్టేయాలని క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదిస్తూ, ఈ కేసు పూర్తిగా రాజకీయ కుట్ర అని పేర్కొన్నారు.

ఏసీబీ కౌంటర్‌ వాదనలు

కేటీఆర్‌ పిటిషన్‌పై ఏసీబీ తరఫున డీఎస్పీ మాజిద్‌ అలీఖాన్‌ కౌంటర్‌ దాఖలు చేశారు. ప్రస్తుత దశలో కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని, ఇలాంటి సమయంలో కోర్టు జోక్యం చేసుకుని నిందితులకు ఊరట కలిగించడం సరైనది కాదని అన్నారు. ఈ వాదనలు అనంతరం, హైకోర్టు కేటీఆర్‌ను అరెస్ట్‌ చేయొద్దంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పొడిగించింది.