హైదరాబాద్ కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (CEC) సుప్రీంకోర్టుకు కీలక నివేదికను సమర్పించింది. పాత పత్రాలు, ఒప్పందాల పరిశీలన తర్వాత, ఈ భూములకు చట్టబద్ధమైన యజమాని హైదరాబాద్ యూనివర్సిటీ (UoH)నేనని CEC స్పష్టంగా గుర్తించింది.
ఈ భూములపై తనఖా (మార్ట్గేజ్) ప్రక్రియను వెంటనే ఆపాలని సుప్రీంకోర్టుకు నివేదికలో సిఫార్సు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి న్యాయపరమైన పరిశీలన లేకుండానే ఈ భూములను తెలంగాణ ఇండస్ట్రియల్ గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC)కు బదిలీ చేసిన దృష్ట్యా వివాదం చోటుచేసుకున్నదని కమిటీ అభిప్రాయపడింది.
ముఖ్యంగా, TGIIC ఈ భూములను అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా మార్టగేజ్ చేసేందుకు ముందుకెళ్లినప్పుడు, గచ్చిబౌలి భూభాగంలోని పర్యావరణ ప్రాముఖ్యతను పూర్తిగా దృష్టిలో పెట్టుకోలేదని నివేదికలో వెల్లడి.
ఈ భూమిలోని కొన్ని భాగాలను ICICI బ్యాంకుతో మార్టగేజ్ చేయడంలో, అక్కడ ఉన్న ఒక లేక్ (కొలను) సైతం ఈ భూములకు భాగమేనని, Hyderabad University హక్కులు చట్టబద్ధంగా కొనసాగుతున్నాయని CEC స్పష్టం చేసింది.
ఇంతకుముందు ఈ భూమిలోని 5 ఎకరాల స్థలంలో HCU నిర్మించిన ఓ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ నిర్మాణం సాధ్యపడలేదని నివేదికలో పేర్కొంది.
కంచె గచ్చిబౌలి భూములు సాంకేతికంగా అడవిగా గుర్తించబడకపోయినా, అటవీ ప్రాంతానికి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఈ భూములకు ఉన్నాయని CEC స్పష్టం చేసింది. ఇది షెడ్యూల్ జాతులకు చెందిన ఎనిమిది రకాల వన్యప్రాణులకు నివాస స్థలంగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.
సైట్ సందర్శన సందర్భంగా అధికారులు నిర్దిష్టంగా ప్రాంతాల హద్దులను గుర్తించడంలో వైఫల్యం చెందారని వ్యాఖ్యానించిన కమిటీ, ఈ భూముల పరిరక్షణకు అనుభవజ్ఞులైన అధికారులు, పర్యావరణ నిపుణులు, వన్యప్రాణి శాస్త్రజ్ఞులు, జియోస్పేషియల్ మ్యాపింగ్ నిపుణుల సలహాలు తీసుకోవడం అత్యంత అవసరమని సూచించింది.
పర్యావరణ అనుమతులు లేకుండానే చెట్లను నరికి, అరకొర అనుమతులతో దురుద్దేశపూరితంగా అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు నివేదికలో కుండబద్దలు కొట్టింది.
400 ఎకరాల భూమిని ఎటువంటి స్పష్టమైన హద్దులు లేకుండా హడావుడిగా చదును చేసేందుకు TGIIC తీసుకున్న చర్యలపై కూడా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది.
Read More : రంగారెడ్డి టోల్ గేట్ వద్ద ప్రభుత్వ ఉద్యోగి దౌర్జన్యం — టోల్ సిబ్బందిపై దాడి
