తెలంగాణ పచ్చదనం కోసం సీఎం పిలుపు

revanth-reddy

ప్రకృతిని మనం కాపాడితేనే మనల్ని కాపాడుతుందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. “వనమే మనం… మనమే వనం” అనే సూక్తిని గుర్తు చేస్తూ, ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. వనమహోత్సవం-2025 కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రుద్రాక్ష మొక్కను నాటుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రతీ ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటాలని, వాటిని తమ పిల్లల్లా సంరక్షించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు అమ్మ పేరుతో మొక్కలు నాటాలనీ, అలాగే తల్లులు కూడా తమ పిల్లల పేరుతో మొక్కలు నాటాలని సూచించారు.
మహిళా సంక్షేమంపై తన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోందని సీఎం తెలిపారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతో పాటు ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను మహిళలకు అప్పగించామని చెప్పారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు, వేల బస్సులను అద్దెకు ఇచ్చేలా చర్యలు తీసుకొని, వారిని బస్సుల యజమానులుగా తీర్చిదిద్దామన్నారు.

హైటెక్ సిటీలో మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ వేదిక కల్పించినట్టు వెల్లడించారు. మిస్ వరల్డ్ పాల్గొన్న అతిథులు మహిళా సంఘాల తయారీ సామగ్రిని చూసి ప్రశంసించారని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.

గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్‌రెడ్డి, కేసీఆర్ పాలనలో మహిళలైన మంత్రులకు స్థానం లేదని గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తెచ్చిందీ కాంగ్రెస్ పార్టీనేనని చెప్పారు. త్వరలోనే శాసనసభల్లో 33% మహిళా రిజర్వేషన్ అమలులోకి వస్తుందని తెలిపారు. 51 అసెంబ్లీ స్థానాలు మహిళల కోసం కేటాయించనున్నట్లు ప్రకటించారు.

ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి

ఈరోజు మధ్యాహ్నం సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి చేరుకోనున్నారు. రెండు రోజులపాటు ఢిల్లీలో ఉన్న ఆయన, మధ్యాహ్నం 2.30కి కేంద్ర క్రీడలు, కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ కానున్నారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రంతో చర్చించనున్నట్టు సమాచారం.

Read More : బీజేపీ లోపాల్లోకి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గళం