మాజీ సీఎం జగన్ తన హయాంలో పెంచిన విద్యుత్ ఛార్జీలపైనే ధర్నా చేయాలని వాళ్ల పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎద్దేవా చేశారు.
ఈనాడు, అమరావతి: మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, మాజీ సీఎం జగన్ తన హయాంలో పెంచిన విద్యుత్ ఛార్జీల పైనే పార్టీ శ్రేణులకు ధర్నా చేయాలని పిలుపునిచ్చారని ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వంలో ఎఫ్పీపీసీఏ కింద రూ.17 వేల కోట్లు ప్రజల నుంచి వసూలు చేయాలని ప్రతిపాదించి, ఇప్పుడు వాటిపైనే ధర్నా చేయాలని జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం తుగ్లక్ చర్య కాదా? అని మంత్రి ప్రశ్నించారు.
“2019లో వైకాపా అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే.. తెదేపా ప్రభుత్వం వివిధ సంస్థలతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను(పీపీఏ) జగన్ సర్కారు రద్దు చేసింది. జగన్ నిర్వాకంతో సుమారు 10 వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను రాష్ట్రం కోల్పోయింది” అని ఆయన విమర్శించారు.
“మార్కెట్లో అధిక ధరకు విద్యుత్ కొనలేదా?” అని గొట్టిపాటి ప్రశ్నించారు. “ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్లు జగన్ హయాంలో నిర్వీర్యమయ్యాయి. డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరా పేరుతో విజయసాయిరెడ్డి అండ్ కో నుంచి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసి రాష్ట్ర విద్యుత్ రంగంపై ఆర్థిక భారాన్ని మోపారు. జగన్ అవినీతి, కక్షసాధింపు చర్యల కారణంగానే ప్రస్తుతం ఇంధన సర్దుబాటు ఛార్జీల రూపంలో ప్రజలపై భారం పడుతోంది” అని ఆయన పేర్కొన్నారు.
2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఎఫ్పీపీసీఏ మొత్తం ప్రజల నుంచి వసూలు చేసుకోవడానికి అనుమతించాలని జగన్ ఏపీఈఆర్సీని కోరారని మంత్రి రవికుమార్ తెలిపారు. “2021-22 ఎఫ్పీపీసీఏ రూ.3,082.99 కోట్లను గత ప్రభుత్వం వసూలు చేసింది. ఆ తర్వాత రెండు సంవత్సరాల ఎఫ్పీపీసీఏ ప్రతిపాదనలను డిస్కంలు ఏపీఈఆర్సీకి సమర్పించినా.. ఎన్నికల దృష్ట్యా నిలిపేశారు. 2022-23కు రూ.6,073 కోట్ల, 2023-24కు రూ.9,412 కోట్లు జగన్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించారు” అని ఆయన చెప్పారు.
ధర్నాలు చేయడం సిగ్గుచేటు
– మంత్రి అచ్చెన్నాయుడు
ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వంలో ఎడాపెడా విద్యుత్తు ఛార్జీలు పెంచి వినియోగదారులను ఇబ్బందిపెట్టిన మాజీ సీఎం జగన్, నేడు ధర్నాలు, ర్యాలీలు చేయడం సిగ్గుచేటని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. విద్యుత్తు రంగాన్ని నిర్వీర్యం చేసి ఛార్జీల పెరుగుదలకు ఆయన కారణమయ్యారని గురువారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. “కమీషన్ల కక్కుర్తితో బహిరంగ మార్కెట్లో యూనిట్ విద్యుత్తును రూ.8 నుంచి రూ.14కు కొనుగోలు చేశారు” అని ఆయన మండిపడ్డారు.
