జగన్ కుటుంబంలో విషాదం: వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూత

వైఎస్ అభిషేక్ రెడ్డి: జగన్ కుటుంబంలో తీవ్ర విషాదం.. వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆరోగ్యం మరింత విషమించడంతో అభిషేక్ రెడ్డి మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్రంగా విషాదంలో మునిగిపోయాయి. పార్టీ నేతలు ఆయనకు నివాళులు అర్పిస్తూ, ఆయన కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

అభిషేక్ రెడ్డి పార్థివదేహాన్ని హైదరాబాద్ నుంచి పులివెందులకు తరలించారు. రేపు ఉదయం పులివెందులలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియల్లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి పాల్గొననున్నారు.

అభిషేక్ రెడ్డి మృతిపై పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ఆయన మృతదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి, మరికొందరు ఎమ్మెల్యేలు నివాళులు సమర్పించారు. అభిషేక్ రెడ్డి మృతితో పులివెందులలో తీవ్ర విషాదం నెలకొంది.