వైసీపీ కీలక నేత అరెస్ట్.. ఎందుకంటే?
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో టీడీపీ నేతలు, పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడుల వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గుడివాడ టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వైసీపీ నేతలపై చర్యలు ప్రారంభమయ్యాయి. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు తీసుకున్న అనేక అక్రమ నిర్ణయాలను నేటి ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.
వరుస అరెస్టులు
గుడివాడ టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి ఇప్పటికే 12 మంది వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. వారి మీద పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేసిన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో భాగంగా అరవపేటకు చెందిన కొండూరి రాజారెడ్డిని తాజాగా అరెస్టు చేసి, న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్‌కు పంపారు. ఇంకా పలువురు వైసీపీ నేతల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఏం జరిగింది?
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని, ఆయన అనుచరులు టీడీపీ నేతలపై అనేక వేధింపులు, బెదిరింపులు చేపట్టారు. 2022 డిసెంబర్ 25న టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, ఇతర టీడీపీ నేతలపై కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లు, పెట్రోల్ ప్యాకెట్లతో దాడి జరిగింది. అయితే, అప్పటి పరిస్థితుల్లో కొన్ని పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.
వైసీపీ నేతల ఆక్రమాలు
నాటి వైసీపీ నేతల వ్యవహారం ఈరోజు తీవ్ర పరిణామాలకు దారి తీస్తోంది. గన్నవరం దాడి కేసు, క్యాసినో వ్యవహారం, గుడివాడ టీడీపీ కార్యాలయ దాడి వంటి అంశాలను ఆధారంగా చేసుకొని కేసులు నమోదు చేస్తున్నారు. కొడాలి నాని, ఆయన అనుచరులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
సీన్ కట్ చేస్తే…
నేటి టీడీపీ కూటమి ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ప్రతి అక్రమానికి తగిన చర్యలు తీసుకుంటోంది. పోలీసుల దర్యాప్తు మరింత వేగంగా కొనసాగుతోంది. కొడాలి నాని, ఆయన అనుచరులు ఇలాంటి కేసులలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు కనిపిస్తోంది.
ఇక ఏమి జరుగుతుందో వేచి చూడాలి.
