Fastest Checkmate: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు
175 క్లిష్టమైన పజిల్స్‌ను 11.59 నిమిషాల్లో పూర్తి చేసి చరిత్ర సృష్టించిన నారా దేవాన్ష్
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ప్రతిష్ఠాత్మక సర్టిఫికెట్
చదరంగ క్రీడాకారుల ప్రేరణతో విజయం: లోకేశ్
లిటిల్ గ్రాండ్‌మాస్టర్‌గా గర్వపడుతున్నా: సీఎం చంద్రబాబు
అమరావతి/హైదరాబాద్, డిసెంబర్ 22 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, మంత్రి లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ చదరంగ క్రీడలో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. తొమ్మిదేళ్ల దేవాన్ష్ 175 క్లిష్టమైన చెస్ పజిల్స్‌ను కేవలం 11 నిమిషాల 59 సెకన్లలో పూర్తి చేసి ‘ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్’గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు.
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో డిసెంబర్ 18న ఈ పోటీ నిర్వహించగా, లండన్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ఆదివారం సర్టిఫికెట్ అందింది. ప్రఖ్యాత చెస్ సంకలనంలోని 5,334 సమస్యల కూర్పు ఆధారంగా ఈ పోటీ నిర్వహించారు.
దేవాన్ష్ తన ప్రతిభతో ఇప్పటికే మరో రెండు ప్రపంచ రికార్డులు సాధించాడు. 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయ్‌ను కేవలం 1.43 నిమిషాల్లో పూర్తి చేయగా, 9 చెస్ బోర్డులను ఐదు నిమిషాల్లో అమర్చాడు.
తనయుడు సాధించిన విజయంపై లోకేశ్ స్పందిస్తూ, “దేవాన్ష్ లేజర్ షార్ప్ ఫోక్‌సతో చెస్ శిక్షణ పొందడం చూసి గర్వపడ్డాను. భారత చెస్ క్రీడాకారుల అద్భుత ప్రదర్శనల నుంచి దేవాన్ష్ ప్రేరణ పొందాడు. రాయ్ చెస్ అకాడమీకి ఈ విజయానికి శ్రేయస్సు చెందుతుంది” అని పేర్కొన్నారు.
వెల్‌డన్ దేవాన్ష్: చంద్రబాబు
దేవాన్ష్ విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. ‘వెల్‌డన్ నారా దేవాన్ష్’ అంటూ ‘ఎక్స్’లో ట్వీట్ చేస్తూ, “ప్రపంచ రికార్డు సాధించిన దేవాన్ష్‌కు నా హృదయపూర్వక అభినందనలు. కష్టపడి సాధించిన ఈ విజయంపై గర్విస్తున్నా, లిటిల్ గ్రాండ్‌మాస్టర్” అని పేర్కొన్నారు.
మంత్రులు అచ్చెన్నాయుడు, రాంప్రసాద్‌రెడ్డి, పార్థసారథి, లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి కూడా దేవాన్ష్‌ను అభినందించారు.
