ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం శ్రీశైల మల్లన్నను దర్శించుకుంది
శ్రీశైలం: ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) తన కుటుంబంతో కలిసి శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు. ఇటీవలే నాగచైతన్య, శోభిత (Naga Chaitanya-Sobhita) వివాహం జరగగా, నూతన దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించి, అర్చకుల ద్వారా వేదాశీర్వచనం పొందారు.
ఆలయ మహాద్వారం వద్ద ఆలయ అధికారులు, అర్చకులు కుటుంబానికి ఘనస్వాగతం పలికారు. వారి పూజా కార్యక్రమాల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాగచైతన్య-శోభిత పెళ్లి ఫోటోలను నాగార్జున పోస్ట్
ఇటీవలే నాగచైతన్య-శోభిత పెళ్లి ఫోటోలను నాగార్జున తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
“ప్రియమైన స్నేహితులు, కుటుంబసభ్యులు, అభిమానులు.. మీ ప్రేమ, ఆశీస్సులతో ఈ వేడుక మరింత ప్రత్యేకంగా మారింది. ఈ అందమైన క్షణాల్లో మమ్మల్ని అర్థం చేసుకున్న మీడియాకు ధన్యవాదాలు. కృతజ్ఞతతో నా హృదయం ఉప్పొంగుతోంది,” అని నాగార్జున పేర్కొన్నారు.
