ఈనాడు, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపు దూసుకెళ్లిపోతుంది. ఇది బుధవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. రాబోయే 24 గంటల్లో వాయవ్య దిశగా ప్రయాణించి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్లే అవకాశం ఉంది. తర్వాత కోస్తా తీరం వెంబడి కదలనుంది. దీని ప్రభావంతో శుక్రవారం వరకు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. గురువారం విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. శుక్రవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
తీవ్ర అల్పపీడనం ప్రభావంతో, తీరం వెంబడి గంటకు గరిష్ఠంగా 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
వాతావరణ మార్పుల ప్రభావం
రాష్ట్రంలో తిరుపతి, బాపట్ల, ఏలూరు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో బుధవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. వాతావరణ పరిస్థితుల మేరకు నవంబరు, డిసెంబరులో ఏర్పడే అల్పపీడనాలు తమిళనాడు సమీపంలో తీరం దాటతాయని వాతావరణ నిపుణులు ఆచార్య భానుకుమార్ పేర్కొన్నారు. వాతావరణ మార్పుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతంలో తీరం దాటాల్సిన అల్పపీడనాలు తమిళనాడులో, తమిళనాడులో తీరం దాటాల్సిన అల్పపీడనాలు మన రాష్ట్రంలో దాటుతున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరున అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐరోపాకు చెందిన మోడల్ సూచిస్తోంది.
