సాక్షుల వరుస మరణాలపై సిట్ దర్యాప్తు వేగవంతం

దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో సాక్షుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఇటీవల మృతిచెందిన కీలక సాక్షి రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి, విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్లు సమాచారం.

వివేకా హత్య కేసులో ఇప్పటివరకు దాదాపు ఆరుగురు సాక్షులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రంగన్న మృతి తర్వాత ప్రభుత్వం స్పందించి ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సిట్ అధికారులు పులివెందులలో ఉండి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మరో సాక్షి కసునూరు పరమేశ్వర్ రెడ్డిని కూడా సిట్ అధికారులు విచారిస్తున్నారు. తొలుత ఆయన నోటీసులు అందుకోలేదని వాదించినప్పటికీ, పోలీసులు అతడిని ఇంటి నుంచే పులివెందుల విచారణ కేంద్రానికి తరలించినట్లు సమాచారం.

ఇక ఇటీవల మృతిచెందిన రంగన్న భార్య సుశీలమ్మను కూడా సిట్ అధికారులు సాయంత్రం విచారించే అవకాశం ఉంది. రంగన్న మృతికి ముందు మరియు అనంతర పరిణామాలపై ఆమె నుంచి కీలక సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.

కేసులో మరణించిన ఇతర సాక్షుల బంధువులు, సన్నిహితులను కూడా విచారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వరుస మరణాల వెనుక ఉన్న అసలు కారణాలను నిగ్గు తేల్చేందుకు సిట్ అధికారులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read More : తిరుమలలో భక్తుల భయంతో కొత్త చర్యలు..

One thought on “సాక్షుల వరుస మరణాలపై సిట్ దర్యాప్తు వేగవంతం

Comments are closed.