తెలుగు చిత్ర పరిశ్రమ భేటీపై కేటీఆర్ వ్యాఖ్యలకు దిల్ రాజు ఘాటైన సమాధానం

ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నూతనంగా ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన దిల్ రాజు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ లేఖను విడుదల చేశారు.

లేఖలో దిల్ రాజు ఇలా పేర్కొన్నారు:

“గౌరవ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిగారితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై గౌరవ మాజీ మంత్రి కేటీఆర్‌ గారు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. గౌరవ సీఎం గారితో జరిగిన ఈ సమావేశం ఒకరిద్దరితో జరిగిన వ్యవహారం కాదని అందరికీ తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి చాలా స్నేహపూర్వకంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి, రాష్ట్రాభివృద్ధి, సామాజిక సంక్షేమానికి, మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం గారు కాంక్షించారు.

హైదరాబాద్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దాలని సీఎం గారి బలమైన సంకల్పాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులుగా మేమందరం స్వాగతం పలికాము. కాబట్టి, అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగి, పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని మా మనవి. రాజకీయ దాడి, ప్రతిదాడుల నుంచి పరిశ్రమను రక్షించవలసిందిగా అందరినీ కోరుతున్నాము. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాము.”

కేటీఆర్ మాట్లాడుతూ: ‘‘సినీ ప్రముఖుల భేటీ తర్వాత అంతా సైలెన్స్ అయ్యారు. అదంతా డైవర్షన్ అండ్ అటెన్షన్ మీటింగ్‌నే. రహస్య ఒప్పందాలు ఏవో జరిగి ఉండవచ్చు. సంధ్య థియేటర్ ఘటనపై సెటిల్‌మెంట్ అయిపోయి ఉండవచ్చు. సినిమా పేరుతో వెళ్లి సర్దుబాబు చేసుకోబడతారేమో…’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.