రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). కియారా అడ్వాణీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. సంగీత దర్శకుడు తమన్ (Thaman) ఎక్స్ వేదికగా ఇటీవల అభిమానులతో చిట్‌చాట్ చేసారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
తమన్ మాట్లాడుతూ, ‘‘‘గేమ్ ఛేంజర్’ అన్ని కోణాల్లోనూ భారీ చిత్రం. పాటలన్నింటినీ 2021 డిసెంబర్‌లోనే పూర్తి చేశా. శంకర్ సర్ ఈ సినిమాకు అంత వేగంగా కంపోజింగ్ అయిపోతారని నేను అనుకోలేదు. అవి బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడ్డాం. చిత్రీకరణ విషయంలో శంకర్, నిర్మాత దిల్ రాజు ఎక్కడా రాజీపడలేదు. ‘జరగండి జరగండి’ పాట అద్భుతం. అది కళ్లజోడు లేకుండా 3డీ చూస్తున్న అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలుంటాయి. జనవరి 4న రెండు సాంగ్స్ విడుదల చేయనున్నారు. రిలీజ్‌కు మరో బిట్ సాంగ్ కూడా ఉంటుంది. శంకర్ గారితో పని చేయాలన్న నా డ్రీమ్ ఈ సినిమాతో నెరవేరింది. ఈ చిత్రం ద్వారా శంకర్ ఎడిటింగ్ విషయంలో కొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్నారు. మూవీ సెకండాఫ్ చాలా రేసీగా ఉంటుంది. రామ్ చరణ్ స్ర్కీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో చరణ్ మరియు అంజలి పాత్రకు ప్రశంసలు దక్కుతాయి. అంజలికి జాతీయ అవార్డు వస్తుందనుకుంటున్నా. ‘ఇండియన్ 2’ ఫలితంపై కొంచెం నిరాశ చెందిన డైరెక్టర్ శంకర్ ‘గేమ్ ఛేంజర్’తో హిట్ కొట్టిపడతారు’’ అన్నారు.
ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర, ఎస్.జె. సూర్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు నిర్మించిన 50వ సినిమా ఇది. సంక్రాంతి కానుకగా ఈ నెల 10న విడుదల కానుంది.
