వరుణుడి సహకారంతో, లోయరార్డర్ బ్యాటర్ల పోరాటంతో గాబా టెస్ట్‌లో భారత జట్టు డ్రాతో గట్టెక్కింది
పింక్ బాల్ మ్యాచ్‌లో ఘోరంగా ఓడిన టీమిండియాకు ఈ ఫలితం ఓదార్పునిచ్చింది.
‘బాక్సింగ్ డే’లో పంచ్ ఎవరిదో?
నేటి నుంచే నాలుగో టెస్ట్
హ్యాట్రిక్‌పై భారత్ గురి
ఉదయం 5 గంటల నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో..
మెల్‌బోర్న్: వరుణుడి సహకారంతో పాటు లోయరార్డర్ బ్యాటర్లు పోరాటాన్ని ప్రదర్శించడంతో గాబా టెస్ట్‌లో భారత జట్టు డ్రాతో గట్టెక్కింది. పింక్ బాల్ మ్యాచ్‌లో ఘోరంగా ఓడిన టీమిండియాకు ఈ ఫలితం ఓదార్పునిచ్చేలా ఉంది. ఐదు టెస్ట్‌ల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది, దీంతో కొంత ఊపిరి పీల్చుకున్న రోహిత్ సేన, తమకు అచ్చొచ్చిన మెల్‌బోర్న్‌లో గురువారం నుంచి జరిగే కీలక నాలుగో, ‘బాక్సింగ్ డే’ టెస్ట్‌లో ఆస్ట్రేలియాతో అమీతుమీకి సిద్ధమైంది.
ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో పాటు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ అవకాశాలు మెరుగవుతాయి. ఓడితే, డబ్ల్యూటీసీ ఫైనల్ చాన్స్ దాదాపు చేజార్చుకొన్నట్టే.
టీమిండియా బ్యాటింగ్ ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా, సీనియర్లు రోహిత్, కోహ్లీ వరుస వైఫల్యాలతో జట్టును ఇబ్బందుల్లో పెట్టేశారు. ఓపెనర్‌గా రాహుల్‌ను కొనసాగిస్తుండగా, గత రెండు టెస్టుల్లో మిడిలార్డర్‌లో ఆడిన రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. పెర్త్‌లో మెరిపించిన కోహ్లీ ఆ తర్వాతి నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనూ పేలవ ప్రదర్శన కనబర్చాడు.
ఈ నేపథ్యంలో, రోహిత్‌ను మళ్లీ ఓపెనర్‌గా దించి, రాహుల్‌ను వన్‌డౌన్‌లో ఆడించే దిశగా మేనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే, శుభ్‌మన్ గిల్‌ను పక్కనబెట్టి, ధ్రువ్ జురెల్‌ను తుది జట్టులోకి తీసుకొనే అవకాశం ఉంది.
యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్‌తోపాటు జడేజా భారీ స్కోర్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరో స్పిన్నర్ కావాలనుకుంటే, ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ స్థానంలో సుందర్‌ను ఆడించొచ్చు. ఎంసీజీలో మెరుగైన రికార్డు ఉన్న కోహ్లీ మెరుపులు మెరిపించాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
ఆఫ్ స్టంప్ అవల పడిన బంతులను వేటాడి అవుటవుతున్న విరాట్, ఆ బలహీనతను అధిగమించేందుకు నెట్స్‌లో తీవ్రంగా సాధన చేశాడు.
బౌలింగ్ విభాగం:
బుమ్రాకు మిగతా బౌలర్ల నుంచి తగినంత సహకారం అందడం లేదు. పేస్‌కు సహకరించే పిచ్‌పై సిరాజ్, ఆకాశ్ దీప్ రాణిస్తేనే టీమిండియా విజయావకాశాలు మెరుగుపడతాయి.
జట్లు (అంచనా)
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, రాహుల్, కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), గిల్/జురెల్, జడేజా, నితీష్/సుందర్, ఆకాశ్ దీప్, బుమ్రా, సిరాజ్.
ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, సామ్ కోన్‌స్టాస్, లబుషేన్, స్మిత్, హెడ్, మార్ష్, క్యారీ (వికెట్ కీపర్), కమిన్స్ (కెప్టెన్), స్టార్క్, లియోన్, బొలాండ్.
పిచ్/వాతావరణం
మెల్‌బోర్న్ వికెట్ స్వతహాగా పేసర్లకు స్వర్గధామం. పిచ్‌పై పచ్చిక కనిపిస్తుండడంతో ఫాస్ట్ బౌలర్లు చెలరేగే అవకాశం ఉంది. గత పర్యటనల్లో రహానె, పుజార సెంచరీలతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. సహజంగా ఇక్కడ టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ చేయడానికే మొగ్గు చూపిస్తుంది. ప్రస్తుతం వాతావరణం వేడిగా ఉన్నా, రెండో రోజు చిరుజల్లులు కురిసే చాన్సులున్నాయి.
90 వేల సీటింగ్ సామర్థ్యం కలిగిన మెల్‌బోర్న్‌లో టికెట్లన్నీ అమ్ముడుపోవడంతో, స్టేడియం మొత్తం సందడి వాతావరణం నెలకొననుంది.
ప్రతీకారం కోసం ఆస్ట్రేలియా
టెస్టుల్లో దశాబ్దకాలంగా ‘బాక్సింగ్ డే’ టెస్ట్‌లో టీమిండియాపై నెగ్గని ఆస్ట్రేలియా ఈసారి విజయం సాధించాలన్న కసితో ఉంది. అయితే, టాపార్డర్ బ్యాటర్ల వైఫల్యం జట్టును కలవరపెడుతోంది.
ఓపెనర్‌గా మెక్‌స్వీని విఫలం కావడంతో అతడి స్థానంలో 19 ఏళ్ల సామ్ కోన్‌స్టాస్ అరంగేట్రం ఖాయం. మరోవైపు, ఖవాజా, లబుషేన్ ఫామ్‌కోసం తంటాలు పడుతున్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న ట్రావిస్ హెడ్ ఫిట్‌నెస్‌పై ఆందోళన రేగినా, అతడు అందుబాటులో ఉంటాడని ఆసీస్ మేనేజ్‌మెంట్ ప్రకటించడం ఊరటనిచ్చే విషయమే.
బౌలింగ్‌లో కెప్టెన్ కమిన్స్, స్టార్క్, మార్ష్ రాణిస్తున్నారు.
గాయపడిన హాజెల్‌వుడ్ స్థానంలో బోలాండ్ జట్టులోకి రానున్నాడు.
ఇరుజట్లలోనూ లోపాలున్నా వాటిని సరిదిద్దుకొని ఆధిపత్యం ప్రదర్శించాలన్న ప్రయత్నం జరగడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
అశ్విన్‌తో సమంగా బుమ్రా
గాబాలో 9 వికెట్లతో అదరగొట్టిన పేసర్ బుమ్రా, టెస్టుల్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన భారత బౌలర్ అశ్విన్‌తో సమంగా నిలిచాడు. మూడో టెస్టు ద్వారా 14 పాయింట్లు సాధించిన బుమ్రా, 904 పాయింట్లతో ఐసీసీ బౌలర్ల జాబితాలో టాప్ ర్యాంకర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.
గతంలో అశ్విన్ అత్యధికంగా 904 పాయింట్లు దక్కించుకున్నాడు.
200 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి బుమ్రాకు కావాల్సిన వికెట్లు: 6
మెల్‌బోర్న్‌లో 14 టెస్టులు ఆడిన భారత్ నాలుగు నెగ్గి, రెండు డ్రా చేసుకుంది. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఓడింది. అయితే, 2014 నుంచి ఇక్కడ భారత్‌కు ఓటమే లేదు. 2014 టూర్‌లో డ్రా చేసుకున్న టీమిండియా 2018, 2020లో విజయాలు సాధించింది.
