యూకేకు చెందిన ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ కేఎన్‌పీ లాజిస్టిక్స్ (KNP Logistics) సైబర్ దాడికి బలై మూతపడే పరిస్థితికి చేరింది. 158 ఏళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న ఈ సంస్థ ఇప్పుడు సాంకేతిక భద్రతా లోపంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
బలహీనమైన పాస్‌వర్డ్.. ప్రమాదానికి మూలం
సంస్థ ఉద్యోగుల్లో ఒకరు ఉపయోగించిన బలహీనమైన పాస్‌వర్డ్‌ను సైబర్ నేరగాళ్లు తేలికగా ఊహించి సంస్థ సర్వర్లను హ్యాక్ చేశారు. దాంతో మొత్తం డేటా నియంత్రణను స్వాధీనం చేసుకుని ఉద్యోగులకు అవసరమైన కీలక సమాచారం అందకుండా చేశారు. దీంతో సంస్థ కార్యకలాపాలు నిలిచిపోయాయి.
కంపెనీ మూతకే మొగ్గు
హ్యాకర్లు కంపెనీని బెదిరిస్తున్నారు, భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారు. సంస్థకు ఆ మొత్తాన్ని చెల్లించే పరిస్థితి లేకపోవడంతో మూత వేయడమే తుది నిర్ణయంగా డైరెక్టర్ పాల్ అబాట్ ప్రకటించారు. అయితే, హ్యాకర్లు ఎంత డిమాండ్ చేశారన్నదానిపై ఆయన వివరాలు ఇవ్వలేదు. సైబర్ నిపుణుల అంచనాల ప్రకారం, ఈ హ్యాకింగ్ ‘అకీరా’ గ్యాంగ్ పనే కావచ్చని, వారు సుమారు 50 లక్షల పౌండ్లు డిమాండ్ చేసి ఉంటారని చెబుతున్నారు.
ఉపాధి కోల్పోతున్న 700 మంది
కంపెనీలో ప్రస్తుతం 700 మంది ఉద్యోగులున్నారు. కంపెనీ మూతపడితే వీరంతా ఒక్కసారిగా ఉపాధి కోల్పోనున్నారు. నిత్యం దేశవిదేశాల్లో 500 లారీలు రవాణా చేస్తున్న ఈ సంస్థకు ఇది పెద్ద దెబ్బగానే చెప్పాలి.
ఈ ఘటన కంపెనీలకు సైబర్ భద్రతపై తీవ్ర హెచ్చరికగా మారింది. ఒక బలహీనమైన పాస్‌వర్డ్ ఎంతటి పెద్ద నష్టానికి దారి తీస్తుందో ఇది మచ్చుతునకగా నిలిచింది.
Read More : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు

2 thoughts on “158 ఏళ్ల కంపెనీకి బలహీనమైన పాస్‌వర్డ్‌తో ముప్పు.”
Comments are closed.