ముడి జూట్ ధర పెంపు: కేంద్రం నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం 2025-26 సీజన్లో ముడి జూట్ కనీస మద్దతు ధరను రూ.315 పెంచింది

కేంద్ర ప్రభుత్వం 2025-26 మార్కెటింగ్ సీజన్లో ముడి జూట్ (టీడీ-3 రకం) కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.315 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2025-26 సీజన్లో ఈ ధర రూ.5,650గా ఖరారైంది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదన ఆమోదం పొందింది. 2014-15లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి జూట్ ధర క్వింటాలుకు రూ.2,400 ఉండగా, ప్రస్తుత ధర 2.35 రెట్లు అధికమై రూ.5,650గా నిర్ణయించబడింది.

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ముడి జూట్ ధర పెంపుతో రైతులకు 66.8% అదనపు లాభం వస్తుందని ఆయన తెలిపారు.

అలాగే, కేబినెట్ జాతీయ ఆరోగ్య మిషన్‌ను మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని నిర్ణయించింది. 2030 నాటికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో పురోగతిని క్యాబినెట్ సమీక్షించింది.