వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా మరో బలమైన ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ తరఫున శాసన మండలిలో డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఉన్న జాకియా ఖానమ్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మంగళవారం రాత్రి ఆమె రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి మెయిల్ ద్వారా పంపినట్లు సమాచారం.

ఈ పరిణామంతో వైసీపీ శిబిరంలో కలకలం రేగింది. బుధవారం ఉదయం 11 గంటల తర్వాత జాకియా ఖానమ్ బీజేపీలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, కేంద్రమంత్రి సత్యకుమార్‌లను ఆమె కలిసినట్లు తెలుస్తోంది.

ఇక శాసన మండలిలో వైసీపీకి మరో వికెట్ కోల్పోయినట్టే. జూలై 2020లో గవర్నర్ నామినేషన్ ద్వారా జాకియా ఖానమ్ ఎమ్మెల్సీగా నియమితులైన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి దారుణమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైన ఈ పార్టీ నుంచి ఇప్పటికే పలువురు కీలక నేతలు నిష్క్రమించారు. జగన్ నాయకత్వంపై అసంతృప్తితో నేతలు ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా జాకియా ఖానమ్ రాజీనామా కూడా అదే సరళిలో కొనసాగుతోంది.

Read More : గన్నవరం కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ ఊరట