యువరాజ్ సింగ్ కీలక సలహా

ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025కు సమయం దగ్గరపడుతున్న వేళ, జట్టులో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేసింది భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్. మెగా టోర్నీలో ఒత్తిడిని ఎలా జయించాలో సూచిస్తూ, 2011లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన ఒక రహస్యాన్ని ఆయన పంచుకున్నారు. సోమవారం ముంబైలో ఐసీసీ ఛైర్మన్ జై షా, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి మహిళల ప్రపంచ కప్ 2025 ట్రోఫీని యువరాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2011 ప్రపంచ కప్‌లో ఎదురైన క్లిష్ట పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. “ఇంగ్లండ్‌తో మ్యాచ్ టై కాగా, దక్షిణాఫ్రికాతో ఓటమి చవిచూశాం. ఆ సమయంలో మాపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. సొంతగడ్డపై విజయం సాధించలేమనే ఒత్తిడి పెరిగింది” అని తెలిపారు.

ఆ సమయంలో సచిన్ టెండూల్కర్, కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ కీలక సలహా ఇచ్చారని యువరాజ్ అన్నారు. “‘టీవీ చూడొద్దు, పేపర్లు చదవొద్దు. మైదానంలోకి వెళ్లేటప్పుడు, రూమ్‌కి తిరిగొచ్చేటప్పుడు హెడ్‌ఫోన్స్ పెట్టుకోండి. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఆటపై ఏకాగ్రత పెట్టండి’ అని వారు చెప్పారు. ఈ సూచన మాకు ఎంతో మేలు చేసింది. విమర్శలను పక్కనపెట్టి ఆటపై దృష్టి పెట్టడం వల్లే 28 ఏళ్ల తర్వాత కప్ గెలిచాం” అని గుర్తుచేశారు. మహిళల ప్రపంచ కప్ 2025 సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇప్పటివరకు ప్రపంచ కప్ గెలవని భారత మహిళల జట్టు, హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో సొంతగడ్డపై తొలి టైటిల్ కోసం బరిలోకి దిగనుంది.

Read More : 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ ఆడాలి

One thought on “యువరాజ్ సింగ్ కీలక సలహా

Comments are closed.