సీఎం చంద్రబాబు పిలుపు: కోటి మొక్కలు నాటుదాం

chandrababu

ప్రకృతి మనందరి సంపద అని, పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యతగా సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్) ద్వారా ఆసక్తికరమైన సందేశాన్ని పోస్ట్ చేశారు.

“అడవులు మన ఊపిరి. జలవనరులు మన జీవనాధారం. వాటిని కాపాడటం మన విధి. అందుకే ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఒక్క రోజులో కోటి మొక్కలు నాటే లక్ష్యంతో ముందడుగు వేస్తున్నాం. అందరూ ఇందులో భాగస్వామ్యం కావాలి. శుభ్రమైన పరిసరాలే ఆరోగ్యానికి మార్గం. అందుకే స్వచ్ఛ భారత్‌లో భాగంగా ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని చేపట్టాం. చెత్తను ఇంధనంగా మార్చే వినూత్న విధానాలతో పర్యావరణాన్ని రక్షించుకుంటున్నాం,” అని తెలిపారు.

ఈ ఏడాది పర్యావరణ దినోత్సవ థీమ్‌గా “ప్లాస్టిక్ కాలుష్య నిర్మూలన”ను ఎంచుకున్న విషయం తెలిసిందే. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ పట్ల మనం కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం నాడు రాజధాని అమరావతిలో నిర్వహించే వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Read More : మైలవరం చిన్నారి హత్యాచార కేసు