వైఎస్ షర్మిల: మహిళల సాధికారిత పేరుతో మోసం – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు

ys sharmila

మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, మహిళల హక్కులు కాపాడేందుకు ప్రభుత్వాల తీరును తప్పుబట్టారు.

స్త్రీ లేకపోతే జననం లేదు, గమనం లేదు, అసలు సృష్టే లేదని షర్మిల వ్యాఖ్యానించారు. తల్లిగా, భార్యగా, సోదరిగా, కూతురుగా మహిళల విశేషమైన పాత్రను కొనియాడారు. అయితే, బీజేపీ ప్రభుత్వానికి మహిళల పట్ల కనీస గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అత్యాచారాలు, వేధింపులు రోజురోజుకూ పెరుగుతున్నా ప్రభుత్వాలు మౌనం పాటిస్తున్నాయని విమర్శించారు.

“ఓటు బ్యాంక్ కోసం మహిళలను వాడుకుంటున్న బీజేపీ”

మహిళలను కేవలం ఓటు బ్యాంక్‌గా ఉపయోగించుకునేలా బీజేపీ వ్యవహరిస్తోందని షర్మిల ఆరోపించారు. ‘వికసిత భారత్’ పేరుతో గొప్పగా ప్రచారం చేస్తూనే, గంటకు 50 మంది మహిళలు భౌతిక దాడులకు గురవుతున్న దారుణ పరిస్థితి కొనసాగుతోందన్నారు. రోజుకు 80 మంది మహిళలు లైంగిక వేధింపులకు గురవుతుండటం బాధాకరమని పేర్కొన్నారు.

“హింసకు కారణం మద్యం, మత్తు పదార్థాలు – ప్రభుత్వాల చిత్తశుద్ధి ఏమైంది?”

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న దాడుల్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం సిగ్గుచేటని షర్మిల ధ్వజమెత్తారు. గడిచిన పదేళ్లలో 2 లక్షల కేసులు నమోదుకాగా, గత ఐదేళ్లలో మహిళలపై అఘాయిత్యాలు 25% పెరిగాయని గుర్తుచేశారు. 54 వేల మంది మహిళలు మిస్సింగ్ కావడం రాష్ట్రంలో భద్రతా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియజేస్తోందని అన్నారు.

మద్యం, మత్తు పదార్థాల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల, మహిళా సాధికారిత పేరుతో అవమానమే జరుగుతోందని అన్నారు. ఉచిత బస్సు, నెలకు రూ.15 వందల ఆర్థిక సహాయం, సున్నా వడ్డీకే రుణాలు, తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15 వేలు వంటి హామీలు గాలికి వదిలేశారని విమర్శించారు.

“మహిళా సాధికారిత అంటే ప్రచార హడావుడి కాదు.. ఆచరణలో కనిపించాలి” అని షర్మిల స్పష్టం చేశారు.

Read More

One thought on “వైఎస్ షర్మిల: మహిళల సాధికారిత పేరుతో మోసం – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు

Comments are closed.