వైఎస్ జగన్ ఆపరేషన్ సిందూర్‌పై స్పందన

దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటం, ఉగ్రవాదుల దాడుల నుంచి పౌరులను రక్షించడం కోసం చేపట్టే చర్యల్లో భాగంగా ‘ఆపరేషన్ సిందూర్’ వంటి చర్యలు అనివార్యమని వైఎసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిశీలకులు, రీజినల్ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించిన జగన్, ఈ సమావేశానికి ముందు కొన్ని ముఖ్య నేతలతో ‘ఆపరేషన్ సిందూర్’ పై ప్రత్యేకంగా చర్చించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఉగ్రవాద స్థావరాలు, వారి శిక్షణ శిబిరాలపై దాడులు చేయడం దేశ రక్షణలో కీలకమైన భాగమని అభిప్రాయపడ్డారు. “దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, ఉగ్రవాదుల దాడుల నుంచి పౌరులను రక్షించడం అనేది దేశానికి అత్యంత ముఖ్యమైన కర్తవ్యం” అని ఆయన స్పష్టం చేశారు.

కశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయకులైన పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని జగన్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. భారత రక్షణ దళాలు ఇటువంటి క్రూరమైన ఉగ్ర చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టాయని ప్రశంసించారు. “అలాంటి ఉగ్ర చర్యలపై భారత రక్షణ దళాలు గట్టిగా స్పందించాయి. ఆపరేషన్ సిందూర్ అనివార్యమైన చర్య. భారత రక్షణ బలగాలకు యావత్ దేశం అండగా నిలుస్తుంది” అని జగన్ అన్నారు.

దేశ పౌరుల భద్రత కోసం తీసుకునే ప్రతి చర్యకు దేశం మొత్తం మద్దతుగా ఉంటుందని ఆయన అన్నారు.

Read More : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి ఎదురుదెబ్బ