జగిత్యాల జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అప్పు వేధింపులకు గురైన ఓ మహిళ తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. దేవన్నపేటకు చెందిన చంద్రశేఖర్ నుంచి 12 సంవత్సరాల క్రితం ముల్కనూరుకు చెందిన గుడికందుల రమేష్ రూ.లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పటి నుంచి చంద్రశేఖర్ పలుమార్లు డబ్బులు అడిగినా… రమేష్ అప్పు తీర్చకుండా మోసం చేశాడు. ఎన్నిసార్లు వాయిదాలు వేస్తూ తప్పించుకున్నాడు. దీంతో చంద్రశేఖర్ పంచాయితీలు పెట్టినా, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులు నాలుగు నెలలుగా పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ నెల 5న రమేష్ డబ్బులు చెల్లించేందుకు అగ్రిమెంట్ రాసిచ్చినా, గడువు ముగిసిన తరువాత కూడా తిరిగి చెల్లించకపోవడంతో, బాధితులపైనే ముల్కనూరు పోలీస్‌స్టేషన్‌లో రమేష్ ఫిర్యాదు చేయడం తీవ్ర ఆవేదనకు దారి తీసింది. పోలీసులు రమేష్ పక్షాన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపించాయి. ముల్కనూరు ఎస్‌ఐపై బాధితులు బెదిరింపుల ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురైన చంద్రశేఖర్ బంధువు, బాధితురాలు రమేష్ ఇంటిముందు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే బాధితురాలి బంధువులు నిందితుడి ఇంటికి చేరుకోవడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఏ క్షణంలోనైనా పరిస్థితి చేజారే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read More : బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు… కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆమోదించడం లేదు – పొన్నం

One thought on “అప్పు వేధింపులతో మహిళ ఆత్మహత్యాయత్నం”
Comments are closed.