డ్రగ్స్ ముఠా ఘాతుకాలు వెలుగు

స్కూల్ బాలికలే లక్ష్యం

ఈ ముఠా ముఖ్యంగా వరంగల్‌లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కీ నిర్వహించేది. స్కూల్‌కు వెళ్లే బాలికలతో పరిచయం పెంచుకుని వారిని నమ్మించే ప్రయత్నం చేసేది. కొంతకాలం మాటలు కలిపి స్నేహం పెంచిన తర్వాత బయటకు తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి అపహరించేది. ఆ తర్వాత ఆ బాలికలను డ్రగ్స్ మత్తులోకి దింపి ముఠాలోని యువకులకు అప్పగించేది. ఆ మృగాళ్లు బాలికలను లైంగిక దాడికి గురి చేసేవారు.

దారుణాలు బయటపడిన ఘటన

ఇటీవల మిల్స్ కాలనీలో ఓ బాలిక కిడ్నాప్ అయ్యింది. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఆరా తీస్తుండగా, ఆ బాలిక రెండ్రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. పోలీసులు బాలికను విచారించగా, ఓ మహిళ తనను మాయమాటలు చెప్పి తీసుకెళ్లిందని, మత్తుమందు ఇచ్చారని తెలిపింది. ఈ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా, డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది.

పోలీసులు రంగంలోకి

బాలిక మత్తుమందులో మునిగిపోవడం, ఆ తర్వాత జరిగిన ఘటనల గురించి తెలియకపోవడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. దీనితో కిలేడీ ముఠా అఘాయిత్యాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం పోలీసులు ఈ ముఠా కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను ఒంటరిగా పాఠశాలలకు పంపాలంటే భయపడుతున్నారు.

సమాజంలో అప్రమత్తత అవసరం

ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా అలజడి రేపింది. ఇలాంటి ముఠాలపై పోలీసుల దృష్టిని మరింత కేంద్రీకరించి కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. బాలల భద్రత కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read More