హోలీ పండగ సందడి దేశవ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతోంది. రంగుల పండుగలో భాగంగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటూ స్నేహితులు, బంధువులతో సరదాగా గడుపుతున్నారు. అయితే, ఈ ఉత్సాహంలో భాగంగా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హోలీ వేడుకల సమయంలో నీటి పరిశుభ్రత విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
హోలీ సందర్భంగా కలుషిత నీటి వాడకం వల్ల వివిధ రకాల వైరస్, బ్యాక్టీరియా వ్యాధులు వ్యాపించే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కలుషిత నీటి ద్వారా ఈకొలై, సాల్మొనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా వల్ల డయేరియా, డిసెంట్రీ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
టైఫాయిడ్ ప్రమాదం:
కలుషితమైన నీటిలో ఉండే సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియాతో టైఫాయిడ్ బారిన పడే అవకాశం ఉంది. టైఫాయిడ్ సోకిన వ్యక్తుల్లో తీవ్రమైన జ్వరం, బలహీనత, జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
వైరల్ ఇన్ఫెక్షన్ల ముప్పు:
కలుషిత నీటి కారణంగా లివర్ ఇన్ఫెక్షన్, జాండిస్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదముంది.
లెప్టోస్పైరోసిస్ వ్యాప్తి:
జంతువుల వ్యర్థాలతో కలుషితమైన నీటి వల్ల లెప్టోస్పైరోసిస్ వ్యాధి సోకే అవకాశం ఉంది. ఈ వ్యాధి వల్ల జ్వరం, వణుకు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కృత్రిమ రంగుల ప్రమాదం:
హోలీ సందర్భంగా వాడే కృత్రిమ రంగుల వల్ల కంటి ఇన్ఫెక్షన్, దురద, ఎర్రబడి కంటి సమస్యలు, చర్మంపై రాషెస్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదముంది.
జాగ్రత్తలు పాటించడం ఎంతో ముఖ్యం:
- హోలీ రంగులు కలపడానికి పరిశుభ్రమైన నీటినే వాడాలి. వీలైనంత వరకు తాజా నీటిని ఉపయోగించడం ఉత్తమం.
- హానికర రసాయనాలు కలిగిన రంగులకు బదులుగా సహజసిద్ధమైన రంగులను ఉపయోగించాలి.
- రంగులు వేసేటప్పుడు అవి నేరుగా కళ్లు, నోటి లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- డీహైడ్రేషన్ బారిన పడకుండా తగినన్ని ద్రవ పదార్థాలు తీసుకోవాలి.
- హోలీ అనంతరం తలారా స్నానం చేయడం ద్వారా శరీరంపై ఉన్న రంగులను పూర్తిగా తొలగించాలి.
- హోలీ వేడుకకు ముందు పెరుగు, యోగర్ట్ వంటి ఆహార పదార్థాలను తీసుకుంటే పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
వాటర్ బెలూన్ల ముప్పు:
హోలీ వేడుకల్లో వాటర్ బెలూన్లను అస్సలు ఉపయోగించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటివల్ల బ్యాక్టీరియా, వైరస్ వ్యాప్తి మరింత అధికమవుతుందని సూచిస్తున్నారు.
హోలీ వేడుకలను ఆనందంగా జరుపుకోవడమే కాకుండా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు పాటించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
