విశాఖపట్నంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపేందుకు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ఈ క్రమంలోనే విప్లవాత్మకమైన ‘డబుల్ డెక్కర్’ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో పైభాగంలో మెట్రో రైలు పరుగులు తీయగా, కింద వాహనాల కోసం ఫ్లైఓవర్ ఏర్పాటు చేయనున్నారు.
ఈ నూతన విధానంతో నగర కేంద్రంలో నాలుగు వరుసల పైవంతెనలు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఆసక్తిగల కన్సల్టెంట్లను ఎంపిక చేసేందుకు ప్రక్రియ ప్రారంభించింది. ఆసియా మౌలిక వసతులు, పెట్టుబడుల బ్యాంకు (AIIB) ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం ఇవ్వడానికి ముందుకొచ్చింది. AIIB ప్రతినిధులు ఏపీఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డితో కలిసి విశాఖలో పర్యటించారు.
ఇదివరకే ఎన్హెచ్‌ఏఐ ట్రాఫిక్ నియంత్రణ కోసం 12 పైవంతెనల ప్రణాళికను రూపొందించింది. కానీ మెట్రో ప్రాజెక్టుతో కలిపి ఒకే సమగ్ర ప్రణాళికగా రూపొందించడంతో ఖర్చు తగ్గడమే కాక స్థల వినియోగం మరింత సమర్థవంతంగా మారనుంది. ఇప్పటికే నాగ్‌పూర్‌లో విజయవంతమైన డబుల్ డెక్కర్ మోడల్‌ను ప్రేరణగా తీసుకుని విశాఖలో అమలు చేస్తున్నారు.
మొత్తం 140.13 కిలోమీటర్ల మేర విశాఖ మెట్రోను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం కాగా, మొదటి దశలో 46.23 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లు నిర్మించనున్నారు. ఇందులో 20.16 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ నిర్మాణం చేపట్టనున్నారు. ముఖ్యంగా మధురవాడ-తాటిచెట్లపాలెం మధ్య 15.06 కిలోమీటర్ల విస్తీర్ణంలో, గాజువాక-స్టీల్‌ప్లాంట్ మధ్య మరో డబుల్ డెక్కర్ నిర్మాణం చేపడతారు.
ఈ ప్రాజెక్టు పూర్తైతే ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన మెట్రో డబుల్ డెక్కర్‌గా విశాఖపట్నం గుర్తింపు పొందే అవకాశముంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షణలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతోంది.
Read More : బోరుగడ్డ అనిల్ విడుదల

One thought on “విశాఖలో మెట్రో డబుల్ డెక్కర్ ప్రాజెక్టు వేగం”
Comments are closed.