విశాఖపట్నం అభివృద్ధిపై మంత్రి నారాయణ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు, ట్రాఫిక్ సమస్యలు, మాస్టర్ ప్లాన్ అమలు వంటి కీలక అంశాలపై అధికారులతో చర్చించారు.
భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులపై దృష్టి
ఈ సమావేశంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీపై ప్రత్యేకంగా చర్చించారని మంత్రి నారాయణ తెలిపారు. ఎయిర్‌పోర్ట్ రోడ్ల కారణంగా ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని, రోడ్ల విస్తరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే, తాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాలను గుర్తించి త్వరలోనే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
మాస్టర్ ప్లాన్‌పై సమీక్ష
విశాఖ మాస్టర్ ప్లాన్‌ను నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. గతంలో కొన్ని స్వార్థ ప్రయోజనాల కోసం మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేశారని ఆరోపించారు. ప్రజల అభిప్రాయాలను తీసుకుని, సమగ్రమైన ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు. నగరంలో రోడ్ల విస్తరణ, మెట్రో రైల్ ప్రాజెక్టు, ఫ్లైఓవర్లు, డబుల్ డెక్కర్ రోడ్ల నిర్మాణంపై అధికారులతో చర్చించామని తెలిపారు.
టౌన్ ప్లానింగ్‌పై చర్చ
భవన నిర్మాణ అనుమతులను మరింత సులభతరం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ తెలిపారు. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యులత, మున్సిపల్ శాఖ అధికారులు, క్రెడాయ్, నరెడ్కో, ఎల్టీపీ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. భవన నిర్మాణాలకు సంబంధించి సెట్ బ్యాక్ నిబంధనలను సరళతరం చేసే అంశంపై కూడా చర్చించామని చెప్పారు.
ఎమ్మెల్యేలు ఏమన్నారంటే?
గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ భోగాపురం మాస్టర్ ప్లాన్ సమీక్ష చేయడం అవసరమని అన్నారు. మాస్టర్ ప్లాన్‌ను మరింత విస్తృతంగా పరిశీలించాలని కోరారు.
విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విశాఖ అభివృద్ధిపై దృష్టి పెట్టిందని అన్నారు. మున్సిపల్ శాఖ కీలకమైనదని, మాస్టర్ ప్లాన్‌లో కొన్ని లొసుగులు ఉన్నాయని తెలిపారు. వీటిని సరిదిద్దాలని కోరామన్నారు.
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, విశాఖ అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. అనకాపల్లి, గాజువాక భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఇతర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
Read More : ఏపీ వాతావరణం: మండుటెండల్లో ఆకస్మిక వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక!
