సృష్టి ఫెర్టిలిటీ కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. శిశువుల అక్రమ రవాణా, మధ్యవర్తుల హస్తంతో నడిచిన ఈ అమానవీయ ఘటనలో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని నడిచిన ఈ స్కాంలో ఇప్పటివరకు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా, హైదరాబాద్ పోలీసులు విచారణలో భాగంగా విశాఖలోని ముగ్గురు మధ్యవర్తులు – విజయ్, సరోజ, రత్నాలలను అరెస్టు చేశారు. వీరు శిశువుల కొనుగోలు, అమ్మకాల్లో కీలక పాత్ర పోషించినట్లు ఆధారాలు లభించాయని సమాచారం.
పోలీసుల దర్యాప్తులో బయటపడిన షాకింగ్ వివరాల ప్రకారం, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పేద కుటుంబాల నుంచి నవజాత శిశువులను తీసుకుని, దరఖాస్తు చేసిన జంటలకు పెద్ద మొత్తాలకు విక్రయించినట్లు తేలింది. ఇది పూర్తిగా వ్యాపార ధోరణితో నడిచిన శిశువుల అక్రమ ముఠాగా పోలీసులు భావిస్తున్నారు. ఇక, ఈ వ్యవహారంలో మరో సంచలన విషయమేమిటంటే, డాక్టర్ నమ్రతకు స్నేహితులు అయిన డాక్టర్ రమ్య, డాక్టర్ రవిలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ శిశువుల అక్రమ రవాణాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం డాక్టర్ రవి, కేజీహెచ్ ఆసుపత్రిలో అనస్థీషియా విభాగంలో పనిచేస్తుండటం గమనార్హం. బాధ్యత గల స్థాయిలో ఉన్న వైద్యులు కూడా ఇలాంటి నేరాల్లో పాల్గొనడం సమాజంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
మరోవైపు, ఈ కేసులో ఇంకా పలువురిపై అనుమానాలు ఉన్నాయని, వారిలో కొందరు రాజకీయ, సామాజికంగా బలమైనవారని పోలీసులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో విశాఖలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Read More : సింగూరు ప్రాజెక్టుకు ముప్పు

One thought on “విశాఖ సృష్టి ఫెర్టిలిటీ స్కాంలో కొత్త అరెస్టులు”
Comments are closed.