ఢిల్లీ: అనూహ్యంగా ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ ఖడ్ సోమవారం రాత్రి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ హోదాలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజున కార్యక్రమాలను సజావుగా నిర్వహించిన ఆయన రాత్రికల్లా అనూహ్యంగా రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపారు. అనారోగ్య కారణాలవల్లే తాను రాజీనామా చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. జగదీప్ రాజీనామాతో రాజ్యసభ సమావేశాలను ప్రస్తుతానికి డిప్యూటీ చైర్మన్ గా ఉన్న జేడీయూ నేత హరివంశ్ నడిపించనున్నారు. 2022 ఆగస్టు 11న ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు 2027 ఆగస్టు వరకూ పదవీకాలం ఉంది. అయితే రెండేళ్ల 344 రోజులకే ఆయన వైదొలగాలని నిర్ణయించుకున్నారు. 74 ఏళ్ల ధన్ ఖడ్ తర్వాత ఉప రాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకుంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది. హరివంశ్ కు అవకాశం ఇస్తారా అనే చర్చ జరుగుతోంది.
కాగా, ‘వైద్యుల సూచనల మేరకు ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఎ)కు అనుగుణంగా నేను ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నా. బాధ్యతల నిర్వహణలో నాకు మద్దతుగా నిలిచిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు. పదవీ కాలంలో మేం చాలా ప్రశాంతమైన, అద్భుతమైన వర్కింగ్ రిలేషన్ ను కొనసాగించాం. ప్రధాన మంత్రి, మంత్రి మండలికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రధాని సహకారం, మద్దతు అమూల్యం. విధి నిర్వహణలో నేను ఎంతో నేర్చుకున్నా. పార్లమెంటు సభ్యుల నుంచి లభించిన గౌరవ మర్యాదలు, అభిమానం చిరకాలం గుర్తుంటాయి. భారత్ సాధించిన అద్భుతమైన ఆర్థిక పురోగతికి సాక్షిగా ఉండటం ఎంతో సంతృప్తినిచ్చింది. దాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. పూర్తి గౌరవం, కృతజ్ఞతలతో రాజీనామా సమర్పిస్తున్నా’ అని తన రాజీనామా లేఖలో ధంఖర్ పేర్కొన్నారు. దేశ 14వ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన సోమవారం సాయంత్రం వరకూ ఆరోగ్యంగా కనిపించినప్పటికీ రాత్రికి అదే కారణంతో రాజీనామా చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
స్వతంత్ర భారత చరిత్రలో ఉప రాష్ట్రపతి పదవిలో ఉండి పదవీకాలం ముగియకముందే రాజీనామా చేసిన వారిలో ధంఖర్ మూడోవారు. అంతకుముందు ఇద్దరు రాజీనామా చేశారు. వారిలో వి.వి.గిరి రాష్ట్రపతి పదవికి పోటీ చేయడం కోసం రాజీనామా చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బైరాన్ సింగ్ శెకావత్ తన పదవీ కాలానికి నెల ముందుగా రాజీనామా చేశారు. అధ్యక్షులుగా ఎన్నికయ్యాక ఆర్. వెంకట్రామన్, శంకర్ దయాళ్ శర్మ. కె.ఆర్.నారాయణన్ ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. మరో ఉప రాష్ట్రపతి కృష్ణకాంత్ పదవిలో ఉండగా మరణించారు.
జగదీప్ ధన్ ఖడ్ ప్రస్థానం చూస్తే..
*1951 మే 18వ తేదీన రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లా కిఠానాలో రైతు కుటుంబంలో ధన్ ఖడ్ జన్మించారు. చిత్తోడ్ గఢ్ లోని సైనిక పాఠశాలలో స్కాలర్షిప్ తో చదువుకున్నారు
*స్కూల్లో ఆయన క్రికెట్ పై మక్కువ చూపేవారు. ఆధ్యాత్మికత, ధ్యానం పైనా ఆసక్తి కలిగి ఉండేవారు
*తొలుత న్యాయవాదిగా రాజస్థాన్ లో పనిచేశారు. సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల కేసును వాదించారు. ఆయనకు బెయిలు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారు
*1990లో రాజస్థాన్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత సుప్రీం కోర్టులోనూ ప్రాక్టీస్ చేశారు
*ఆయన ఎక్కువగా ఉక్కు, బొగ్గు, మైనింగ్, ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ కేసులను వాదించేవారు
*2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టేవరకూ ధన్ ఖడ్ పలు హైకోర్టుల్లో కేసులను వాదించారు
*తొలుత జనతాదళ్ తరపున రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1989లో ఝుంఝును నుంచి లోకసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. చంద్రశేఖర్ మంత్రివర్గంలో పార్లమెంటరీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రిగా పని చేశారు. పీవీ నరసింహారావు హయాంలో కాంగ్రెస్ లో చేరారు. రాజస్థాన్ కు చెందిన ఈ జాట్ నాయకుడు.. జాట్లను ఓబీసీల్లో చేర్చేందుకు కృషి చేశారు
Read More : 158 ఏళ్ల కంపెనీకి బలహీనమైన పాస్‌వర్డ్‌తో ముప్పు.

2 thoughts on “అనూహ్యంగా ఉప రాష్ట్రపతి రాజీనామా”
Comments are closed.