సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ మోహన్ రిమాండ్ పొడిగింపు

Vamsi gets security in jail

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్‌ జ్యుడీషియల్ రిమాండ్‌ను మరోసారి పొడిగించారు. విజయవాడ కోర్టు తాజా ఉత్తర్వులతో వంశీతో పాటు ఈ కేసులో అరెస్టయిన మిగిలిన నిందితుల రిమాండ్‌ను కూడా ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించారు.

గతంలో ఫిబ్రవరి 13, 2025న వంశీని పోలీసులు అరెస్టు చేశారు. దళిత యువకుడు ఎం. సత్యవర్థన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిడ్నాప్, బెదిరింపులు, బలవంతపు వసూళ్ల ఆరోపణలపై వంశీపై కేసు నమోదు అయింది. 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి సమయంలో, అక్కడ పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్‌ను వంశీ అనుచరులు కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

పోలీసుల దర్యాప్తులో సత్యవర్థన్‌ను హైదరాబాద్, విశాఖపట్నం మధ్య గుట్టుచప్పుడు కాకుండా తరలించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇటీవల మంత్రి కొల్లు రవీంద్ర విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజీ ఈ కేసుకు కీలక మలుపు తీసుకువచ్చింది. ఫిబ్రవరి 13న వంశీ అనుచరులు కారులో సత్యవర్థన్‌ను కోర్టుకు తీసుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేశారు. వారిలో వెంకట శివరామకృష్ణ (A7), నిమ్మ లక్ష్మీపతి (A8)లు కూడా ఉన్నారు. ప్రస్తుతం వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Read More : AP : రాష్ట్రవ్యాప్తంగా వర్ష సూచనలు