ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ జిల్లాలో ఇటీవల సంభవించిన వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న ధరాలీ గ్రామంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఖీర్‌గడ్, భాగీరథి నదులు ఉప్పొంగడంతో ఈ గ్రామం మొత్తం బురదలో కూరుకుపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మరణించగా, వంద మందికి పైగా గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు.
ఇస్రో సహకారంతో గాలింపు
గల్లంతైన వారి ఆచూకీ కోసం జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌లో అధికారులు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సహకారం తీసుకుంటున్నారు. ఇస్రో అందించిన శాటిలైట్ చిత్రాల ఆధారంగా, గతంలో భవనాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి తవ్వకాలు జరుపుతున్నారు. బురదలో చిక్కుకున్న వారిని గుర్తించడంలో ఈ చిత్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అధికారులు తెలిపారు.
యాత్రికుల తరలింపు
గంగోత్రికి వెళ్లే యాత్రికులు మార్గమధ్యంలో ధరాలీ గ్రామంలో ఆగుతుండడం వల్ల కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా పలు రోడ్లు మూతపడి యాత్రికులు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా తరలించడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌కు అవసరమైన అత్యాధునిక పరికరాలను విమానాల్లో యుద్ధప్రాతిపదికన గ్రామానికి తరలిస్తున్నారు.
Read More : రాహుల్ ఆరోపణలకు థరూర్ మద్దతు
