టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అమెరికా – పాక్ స్పందన

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత అమెరికా, పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న నిషేధిత లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌)ను ఉగ్రవాద సంస్థగా ఇటీవల ప్రకటించింది. ఈ నిర్ణయంపై తాజాగా పాకిస్థాన్ స్పందించింది. అమెరికా నిర్ణయంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ స్పష్టం చేశారు. వాషింగ్టన్ డీసీలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడుతూ, “టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించే సార్వభౌమాధికారం అమెరికాకు ఉంది. ఆధారాలు ఉన్నప్పుడు వారు అలాంటి నిర్ణయం తీసుకోవచ్చు. మేము దీనికి ఎలాంటి వ్యతిరేకత చూపడం లేదు” అని తెలిపారు. అయితే టీఆర్‌ఎఫ్‌ను లష్కరే తోయిబాతో ముడిపెట్టడం తప్పని, ఆ సంస్థను తాము ఇంతకుముందే కూల్చేశామని పేర్కొన్నారు.

గత ఏప్రిల్ 22న పహల్గాం బైసరాన్ వ్యాలీలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26 మంది ప్రాణాలు హరించిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిన విషయం తెలిసిందే. ఈ దాడికి మొదట టీఆర్‌ఎఫ్ బాధ్యత వహించినట్లు ప్రకటించినా, తరువాత తమ ప్రకటనను వెనక్కి తీసుకుంది.

ఈ నేపథ్యంలోనే అమెరికా టీఆర్‌ఎఫ్‌ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. భారత్ ఇప్పటికే 2023 జనవరిలో చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Read More : తుర్కిష్ ఎయిర్‌లైన్స్‌లో మృతదేహం మాయం!

One thought on “టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అమెరికా – పాక్ స్పందన

Comments are closed.