బాలీవుడ్ నిర్మాత కరణ్ సింగ్‌పై నటి రుచి గుజ్జర్ దాడి

బాలీవుడ్‌లో సంచలనం రేపిన సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత కరణ్ సింగ్ చౌహాన్‌పై సీరియల్ నటి రుచి గుజ్జర్ దాడి చేసింది. కరణ్ సింగ్ నిర్మించిన ‘సో లాంగ్ వ్యాలీ’ చిత్రం స్క్రీనింగ్ సందర్భంగా ఈ సంఘటన జరగడం ప్రత్యేకంగా నిలిచింది. మీడియా ప్రతినిధుల సమక్షంలోనే రుచి గుజ్జర్ ఆయనపై చెప్పు విసరడం కలకలం రేపింది.

తనను సహనిర్మాతగా తీసుకుంటానని మాట ఇచ్చి రూ.24 లక్షలు తీసుకుని మోసం చేశాడని రుచి ఆరోపించింది. ఈ నేపథ్యంలో కరణ్‌పై మోసం, నమ్మకద్రోహం, బెదిరింపుల కేసు నమోదు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రుచి గుజ్జర్ వివరాల ప్రకారం, కరణ్ సింగ్ టీవీ సీరియల్ నిర్మాణం పేరుతో తన వద్ద నుంచి రూ.24 లక్షలు తీసుకున్నాడని, కానీ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టకపోగా సాకులు చెప్పి తప్పించుకున్నాడని ఆరోపించింది. డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు దిగాడని తెలిపింది.

ఈ నేపథ్యంలోనే ‘సో లాంగ్ వ్యాలీ’ స్క్రీనింగ్ సమయంలో నిరసన తెలపడానికి అక్కడికి వెళ్లినట్లు రుచి వెల్లడించింది. వివాదం తారస్థాయికి చేరడంతో పోలీసులు జోక్యం చేసుకుని రుచిని అక్కడి నుంచి తరలించారు. కరణ్ సింగ్ చౌహాన్‌పై నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read More : మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘అతడు’ రీ-రిలీజ్ ?